నర్సంపేట, జనవరి 1: గత జనవరిలో నర్సంపేట నియోజకవర్గంలో భారీ వడగండ్ల వానతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. జిల్లాలోనే అధికంగా నర్సంపేట ప్రాంతంలో పంట దెబ్బతినడంతో వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పంటను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. మంత్రులు నేరుగా రైతులను కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం అన్నదాతలకు నష్టపరిహారం ఇప్పించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో పలుమార్లు మాట్లాడారు. ఎట్టకేలకు ఇటీవల ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారు. వడగండ్ల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. కేంద్రం 60 శాతం పరిహారం అందించాల్సి ఉన్నా ఇవ్వలేదు. దీంతో వందశాతం నష్టపరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించింది.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జీవో 42 ద్వారా పరిహారం విడుదల చేయడంతో నర్సంపేట డివిజన్లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ వేసేందుకు నిర్ణయించారు.
మిరప, మక్కజొన్నకు పరిహారం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13,234 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నది. ఇందులో నర్సంపేట నియోజకవర్గంలో 13,030 ఎకరాల్లో మిర్చి పంట ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,425 ఎకరాల్లో మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో నర్సంపేటలో 5,100 ఎకరాల్లో మక్కజొన్న పంట పాడైంది. నర్సంపేట నియోజకవర్గంలో 12,565 మంది రైతులకు మిర్చి పంట పరిహారం అందనుంది. 4,110 మంది రైతులు 5100 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేసి పంటను కోల్పోయారు. వీరికి కూడా పరిహారం అందనుంది. మొత్తం 16,675 మంది రైతులు వడగండ్ల సాయం అందుకోనున్నారు. మిర్చి పంటకు ఎకరాకు రూ. 5,400, మక్కజొన్నకు ఎకరాకు రూ. 3,333 పరిహారం అందించేందుకు నిర్ణయించారు. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మండలాల రైతులకు పరిహారం అందనుంది.
రైతులకు అండగా ఉంటా
రైతులకు అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా. నియోజకవర్గంలో పంట నష్టం జరిగిన నాటి నుంచి పరిహారం అందించేందుకు కృషి చేశా. పంటనష్టం జరిగిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదించాం. రైతులకు నష్టపరిహారం అందించిన సీఎం కేసీఆర్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కృతజ్ఞతలు.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
సంతోషంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం మంజూ రు చేయడం సంతోషంగా ఉంది. వడగండ్లు ఎక్కువగా నర్సంపేట ప్రాంతంలోనే పడి తీవ్రంగా నష్టపోయాం. పంటలు పూర్తిగా అక్కరకు రాకుండా పోయాయి. పంటలు చేతికొస్తాయని అనుకున్న దశలో భారీ వడగండ్ల వాన పడింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి చేసి పరిహారం మంజూరు చేయించారు. సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు.
– అజ్మీరా లక్ష్మి, మహిళా రైతు, గుండ్లపహాడ్
సాయం అందించడం హర్షణీయం
వడగండ్ల వానతో పంటలు మొత్తం తుడిచిపెట్టుకుని పోయాయి. రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నష్టపరిహారం అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సాయం కింద డబ్బులు అకౌంట్లలో వేస్తామని ప్రకటించడం హర్షణీయం. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి రుణపడి ఉన్నాం. సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు.
– కొలగాని రామారావు, రైతు, కొండయిల్పల్లి