మహబూబాబాద్ : పట్టణ కేంద్రంలోని వైన్ షాప్ అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సాధారణంగా వైన్ షాపుల అమ్మకాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అమ్మకాలను కొనసాగించాలి. కానీ, అలా కాకుండా పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో ఉన్న ఓ వైన్ షాప్ యజమాని ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయంలో వైన్ షాప్ పక్కన ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మద్యం ప్రియులు స్థానిక వాసులతో ఘర్షణకు దిగుతున్నారని పేర్కొన్నారు.
ఈ విషయాలను స్థానికులు అనేక మార్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేసినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా ఉండి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మద్యం షాపు యజమాని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారితో సత్సంబంధాల వల్లనే యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పంధించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఈ వైన్ షాప్ పైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.