మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 3 : మహబూబాబాద్ జిల్లా భజనతండా వద్ద జరిగిన పార్థసారథి హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో పడి అతడి భా ర్యే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలను గురువారం మానుకోట టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెల్లడించా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన పార్థసారథి భార్య స్వప్నకు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన వెంకట విద్యాసాగర్‌తో వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
అనేకసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా స్వప్నలో మార్పు రాలేదు. ఈ విషయమై పార్థసారథి భద్రాచలం పోలీస్ స్టేషన్లో విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేశాడు. ఇటీవలె పార్థసారథికి జిల్లాలోని దంతాలపల్లి ఎంజేపీ గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్గా ఉద్యోగం రావడంతో అక్క డే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ సెలవుల్లో భార్య వద్దకు వెళ్లి వస్తున్నాడు. రెండు రోజుల క్రితం మానుకోట శివారు భజనతండా వద్ద భద్రాచలానికి చెందిన పార్థసారథి హత్య జరిగింది. మృతుడి అక్క హేమ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. భార్యపై అనుమానంతో పార్థసారథి తరచూ వీడియో కాల్స్ చేస్తుండడంతో ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పడంతో అతడు భద్రాచలానికి చెందిన తెలుగునూరి వినయ్, శివశంకర్, వంశీకి పార్థసారథిని హత్య చేస్తే రూ. 5 లక్షలు సుపారీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. పార్థసారథి ఇటీవలె సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి దంతాలపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో విద్యాసాగర్‌కు స్వప్న సమాచారం ఇచ్చింది. దీంతో వినయ్, శివశంకర్, వంశీ అతడిని కారులో వెంబడించి భజనతండా వద్ద హత్య చేశారు. మృతుడి అక్క హేమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు స్వప్న, విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు పాల్పడి పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్వయ్య, ఎస్సై దీపికారెడ్డిని ఆయన అభినందించారు.