హనుమకొండ చౌరస్తా, మే 31 : తాత్కాలిక ఉద్యమకారుల ఎంపిక కమిటీలో అసలైన ఉద్యమకారులను పరిగణలోకి తీసుకోలేదని, అందరూ తెలంగాణ వ్యతిరేకులే ఉన్నారని బీసీ రాష్ట్ర నాయకుడు ఏదునూరి రాజమౌళి, ఎమ్మెల్సీ అభ్యర్థి తాటిశెట్టి క్రాంతికుమార్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని నిలదీశారు. నయీంనగర్‌లో జరిగిన సమావేశంలో వారు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కేవలం మైకులు పట్టుకుని వేదికలపై మాట్లాడేవారే ఉన్నారని, నిజమైన ఉద్యమకారులను ఎలా గుర్తిస్తారని వారు నిలదీశారు.
ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అసలు తెలంగాణ ఉద్యమంలో లేరని, పిలిస్తే వచ్చి మాట్లాడేదని, టీడీపీలో ఉన్న అలాంటి వ్యక్తి ఒక కమిటీ వేసి ఉద్యమకారులను ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కమిటీ సభ్యులు ఉద్యమకారులను గుర్తిస్తారని, ఒకవేళ మిస్సయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎన్రోల్ చేయించాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు హంటర్ రోడ్డులోని డీ-కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని, రాజకీయ పార్టీలకతీతంగా అందరిని ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, అబూబక్కర్, పుల్లూరి సుధాకర్, బోడ డిన్న, రహీమున్నీసాబేగం ఉన్నారు.