వర్ధన్నపేట, నవంబర్ 9: తొమ్మిదిన్నర ఏండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలే భారీ విజయాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ కార్యాలయంలో గురువారం నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతోపాటు ప్రజల సంక్షేమానికి ఎంతో శ్రమించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి రూ.160కోట్లతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. వర్ధన్నపేటకు 100 పడకల ఆస్పత్రి మంజూరు చేయించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో రూ.2,500కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలందకీ అందించినట్లు చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ తదితరాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఆసరా పింఛన్లు, రైతుబంధు పెంచనుందున వృద్ధులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యబీమా, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, సౌభాగ్యలక్ష్మి అమలు చేస్తామని చెబుతున్నామని, ఇందుకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని తెలిపారు. వారు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. రెండుసార్లు తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశానో ప్రజలు గుర్తించాలని, మరోసారి అవకాశం కల్పిస్తే పనులను కొనసాగించడంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందించేందుకు కృషి చేస్తానని కోరుతున్నట్లు చెప్పారు. కేవలం ఎన్నికల సమయంలో వచ్చీ నాయకుల మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. పనిచేసే బీఆర్ఎస్ పార్టీని ప్రజలంతా మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, రైతు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, హనుమకొండ జడ్పీ వైస్‌చైర్మన్ శ్రీరాములు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్, చొప్పరి సోమయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ ఉన్నారు.
వరంగల్/పర్వతగిరి/ఐనవోలు: అరూరి రమేశ్ గురువారం నామినేషన్ పత్రాలతో ఆనవాయితీ ప్రకారం సర్వమత ప్రార్థనలు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. మహా మండపంలో పండితులు అమ్మవారి శేషవస్త్రాలను బహుకరించారు. పర్వతగిరి మండలం అన్నారం అన్నారం షరీఫ్ దర్గాలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన్ను ఆశీర్వదించారు. ఐనవోలు మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రెడ్డిపాలెంలో అమలోద్బవి మాతా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, యేసుకీస్తు దీవెనలు తీసుకున్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, అరూరి విశాల్, చిన్నపాక శ్రీనివాస్, మేడిశెట్టి రాములు, ఎస్కే షబ్బీర్, మనోజ్‌కుమార్‌గౌడ్, ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, చింతపట్ల సోమేశ్వర్రావు, సీఏ కొయ్యల రాజు, హసన్ ఉద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, సొసైటీ వైస్ చైర్మన్లు టీసీఆర్, బాబు, సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, మండల కోఆప్షన్ మెంబర్ గుంషావళి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట శాసనసభ అభ్యర్థి రమేశ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం వరంగల్ భద్రకాళి, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాల్లో పూజలు, ఐనవోలు మండలం రెడ్డిపాలెం చర్చిలో ప్రార్థనలు చేశారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, రైతు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, హసన్‌పర్తి సొసైటీ చైర్మన్ వనంరెడ్డి వెంట రాగా ఆయన రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడేకు నామినేషన్ పత్రాలను అందించారు. అలాగే ఆయన తరఫున మరో సెట్ నామినేషన్ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, ఐనవోలు జడ్పీటీసీ గజ్జెలి శ్రీరాములు, చొప్పరి సోమయ్య రిటర్నింగ్ అధికారికి అందజేశారు. శుక్రవారం మరో నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్యే రమేశ్ ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్య నాయకులు చేరుకోగా నామినేషన్ వేసి బయటకు వచ్చిన రమేశ్‌ను ఎత్తుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.