వరంగల్ చౌరస్తా: ప్రజలకు అందించాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని చేస్తే సహించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి శనివారం నాడు ఆయన సందర్శించారు. విధుల నిర్వహణ ఇష్టం లేకపోతే సెలవు పెట్టుకుని వెళ్లిపోవచ్చని వైద్యులకు సూచించారు.
ఎంజీఎం పరిస్థితిని ఫోన్లో కలెక్టర్కు వివరించి, విధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఎంజీఎం ఆవరణలో శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉందని సంబంధిత కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర విభాగంలో యంత్ర పరికరాల పనితీరును పరిశీలించి అవసరాలను అడిగి తెలుకున్నారు. బెడ్స్ పై కనీసం బెడ్ షీట్స్ సైతం ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వారానికి రెండు రోజులు ఎంజీఎం ఆస్పత్రిని సందర్శిస్తానని వైద్యుల తీరు మార్చుకోవాలని, నిర్లక్ష్యాన్ని అస్సలు సహించమని స్పష్టం చేశారు.