సుబేదారి, జూన్ 2 : మెడికల్ సీట్లు ఇప్పిస్తానని కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం హనుమకొండలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి నిందితుడి అరెస్ట్‌ను చూపించి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన చాగంటి నాగసాయి శ్రీనివాస్ వైష్టవి ఎడ్యుకేషన్ స్థాపించి ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లో ప్రముఖ మెడికల్ కళాశాలల్లో సీట్లు ఇప్పిస్తానని పలువురిని నమ్మించారు. వరంగల్‌కు చెందిన బరిగెల విజయకుమార్ కూతురికి మెడికల్ సీటు ఇప్పిస్తానని నమ్మించి రూ.50లక్షలకు ఒప్పందం చేసుకొని మొదట రూ.9లక్షలు తీసుకున్నాడు. తర్వాత విషయాన్ని నాగసాయి దాటవేయడంతో విజయకుమార్ మోసపోయానని తెలుసుకొని అతడిపై వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశాడు.
సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాగసాయిని అరెస్ట్ చేసి విచారించగా 20 నుంచి 30మందికి మెడికల్ సీట్లు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. అలాగే నిందితుడి నుంచి రూ.3లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు, సుబేదారి ఇన్స్పెక్టర్ షుకూర్, సిబ్బందిని సీపీ అభినందించారు. మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు ఇప్పిస్తానని దళారులు చెప్పే మాటలు విని మోసపోవద్దని, సీట్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బుల వసూళ్లకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.