నర్సంపేట, ఫిబ్రవరి 7 : యువత సక్రమ మార్గంలో పయనించాలని, గంజాయి తదితర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. సోమవారం నర్సంపేటలోని సిటిజన్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మాదకద్రవ్యాల నిర్మూలనపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారని గమనిస్తుండాలన్నారు. గంజాయికి అలవాటు పడిన వారి సమాచారం అందిస్తే వెంటనే చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు నర్సంపేటలో 14 మంది గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. ఒక గంజాయి మొక్కను ధ్వంసం చేశారన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తే సమాచారం అందించాలన్నారు. నర్సంపేట ఏసీపీ ఫణీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎంపీపీ మోతె కళావతి, తహసీల్దార్ రామ్మూర్తి, కమిషనర్ విద్యాధర్, ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్య, సీఐలు పులి రమేశ్, సూర్యప్రసాద్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన..
కరీమాబాద్ : విద్యార్థులకు గంజాయి, గుడుంబా తదితర మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ తహసీల్దార్ ఫణికుమార్, మామునూరు సీఐ రమేశ్, ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి..
వర్ధన్నపేట : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అబ్కారీ శాఖ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ కరంచంద్ సూచించారు. మండల కేంద్రంలో డిగ్రీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. చదువుకునే వయసులో వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ గొల్ల రమేశ్, ఎక్సైజ్ సీఐ పవన్‌కుమార్, సీఐ సదన్‌కుమార్ పాల్గొన్నారు.
దృష్టి కేంద్రీకరించాలి..
రాయపర్తి : యువత అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్ సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డీఎస్పీ పోరిక కరంచంద్ అధ్యక్షతన డ్రగ్స్ నియంత్రణపై సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, ఎక్సైజ్ శాఖ వర్ధన్నపేట ఎస్సై సువర్ణ, గారె నర్సయ్య, ఎనగందుల యాకనారాయణ, పూస మధు, నలమాస సారయ్య, గూబ ఎల్లయ్య, చెడుపాక కుమారస్వామి, అయిత రాంచందర్, చందు రామ్‌యాదవ్ పాల్గొన్నారు.
బానిస కావొద్దు..
మట్టెవాడ : యువత మాదక ద్రవ్యాలకు బానిసై ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని సీఐ రమేశ్ అన్నారు. వరంగల్ ఏసీపీ కార్యాలయం నుంచి కమిషనరేట్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.