వరంగల్, జనవరి 28 (నమస్తేతెలంగాణ): బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లకు వడ్డీలేని రుణాల అందజేతలో జిల్లా దూసుకెళ్తున్నది. నిర్దేశిత లక్ష్యంలో 98.45 శాతం రుణ పంపిణీతో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉండడం విశేషం. గడువు మరో రెండు నెలలు ఉండగా ఇప్పటికే జిల్లాలో 5,875 ఎస్‌హెచ్‌జీలకు రూ. 323.06 కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలేని రుణాలను అందజేస్తున్నది. తీసుకున్న రుణం తిరిగి రెగ్యులర్‌గా చెల్లిస్తున్న ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణం పొందే అవకాశం కల్పిస్తున్నది. ఒక్కో ఎస్హెచ్జీకి రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు ఇస్తున్నది. ఈ రుణం పొందిన సభ్యులు మొత్తంలో మూడు లేదా నాలుగు శాతం చొప్పున వాయిదా పద్ధతిన నెలనెలా బ్యాంకులో వడ్డీ సహా రుణం చెల్లించాల్సి ఉంది. ఇలా అసలు, వడ్డీ కలిపి బ్యాంకులో చెల్లించిన ఎస్హెజీలకు ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి ఇస్తున్నది.
ఆయా ఎస్‌హెచ్‌జీ చెల్లించిన వడ్డీ మొత్తాన్ని సదరు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. తద్వారా ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులైన మహిళలందరూ లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 8,771 ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 328.13 కోట్ల రుణం అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు గురువారం వరకు జిల్లాలో నెలనెలా రెగ్యులర్‌గా రుణాలు చెల్లించిన ఎస్‌హెచ్‌జీల్లో 5,875 సంఘాలకు రూ. 323.06 కోట్ల రుణ పంపిణీ జరిగింది. లక్ష్యంలో 101.48 శాతం పంపిణీ చేసి కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో, 98.45 శాతం రుణ పంపిణీతో వరంగల్ జిల్లా సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈ నెలాఖరులోగా టార్గెట్‌ను అధిగమించాలని అధికారులు ముందుకెళ్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు మరో రెండు నెలలు ఉండగానే పది నెలలకే లక్ష్యాన్ని అధిగమించడంలో కీలక పాత్ర వహించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం సంపత్రావుతోపాటు చొరవ చూపుతున్న అధికారులకు పలు సందర్భాల్లో ప్రభుత్వం అభినందనలు తెలిపింది.
జిల్లాలో నర్సంపేట ముందంజ
బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణాల పంపిణీలో జిల్లాలో రెండు మండలాలు టాప్‌లో ఉన్నాయి. నర్సంపేట మండలం 121.73 శాతం రుణ పంపిణీతో ముందంజలో ఉంది. ఈ మండలంలో 800 ఎస్‌హెచ్‌జీలకు రూ. 32.19 కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. గురువారం నాటికి ఇక్కడ 594 ఎస్‌హెచ్‌జీలకు రూ. 39.19 కోట్ల రుణ పంపిణీ జరిగింది. 113.53 శాతంతో గీసుగొండ మండలం జిల్లాలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 758 ఎస్‌హెచ్‌జీలకు రూ. 28.17 కోట్ల రుణం పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో గురువారం వరకు 486 ఎస్‌హెచ్‌జీలకు రూ. 31.98 కోట్ల పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా ఈ ఆర్థిక సంవత్సరం ఖానాపురంలో 99.73, సంగెంలో 99.15, వర్ధన్నపేటలో 98.31, దుగ్గొండిలో 98.24 శాతం, ఖానాపురంలో రూ.24.44 కోట్ల టార్గెట్‌కు రూ.24.38, సంగెంలో రూ.31.05 కోట్ల లక్ష్యానికి రూ.30.79 కోట్ల రుణ పంపిణీ జరిగింది. వర్ధన్నపేటలో రూ.24.82 కోట్లకు రూ.24.40 కోట్లు, దుగ్గొండిలో రూ.25.04 కోట్లకు రూ.24.60 కోట్ల రుణం ఎస్‌హెచ్‌జీలకు అందింది. 87.47 శాతంతో చెన్నారావుపేట మండలం జిల్లాలో వెనుకబడి ఉంది. ఇక్కడ రూ.31.33 కోట్ల టార్గెట్‌కు రూ.27.41 కోట్ల పంపిణీ జరిగింది. 90.19 శాతంతో నెక్కొండ మండలం తక్కువ రుణ పంపిణీ జరిగిన మండలాల్లో రెండో స్థానంలో ఉంది. రాయపర్తిలో 91.55, నల్లబెల్లిలో 91.64, పర్వతగిరిలో 94.31 శాతం వడ్డీలేని రుణాల పంపిణీ జరిగినట్లు అధికారులు తెలిపారు. వెనుకబడిన మండలాల్లో రుణాల అందజేత వేగం పెంచే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
నెలాఖరులోగా వందశాతం
ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో జిల్లా ప్రతి సంవత్సరం మంచి ప్లేస్‌లో ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం 98.45 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. జిల్లాలోని ఎస్‌హెచ్‌జీలు బ్యాంకు లింకేజీ రుణాలను వినియోగించుకుని రెగ్యులర్‌గా చెల్లిస్తున్నారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ వందశాతం చేరుకోనుంది.