వర్ధన్నపేట, డిసెంబర్ 12:బృహత్ ప్రకృతివనం.. పది ఎకరాలు.. ఇందులో వేలాది సంఖ్యలో నాటిన మొక్కలకు నీటిని అందించడం కష్టసాధ్యమే. కాల్వలు తీసి పారిస్తే నీటి వృథా ఎక్కువగా ఉంటుంది. పైగా ప్రతి మొక్కకు నీరు అందడం కూడా ఇబ్బందే. దీన్ని అధిగమించేందుకు వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ ఆరెల్లి స్రవంతి అంజన్రావుకు స్ప్రింక్లర్లు, డ్రిప్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆరు ఎకరాల్లో స్ప్రింక్లర్లు, రెండు ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేసి, పక్కనున్న ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ నీటిని అందిస్తున్నారు. దీంతో మొక్కలకు నీళ్లు సమృద్ధిగా అందుతూ ఏపుగా పెరుగుతున్నాయి. కొద్ది నెలల్లోనే చిట్టడవిలా మారనుంది. –
ప్రభుత్వం పల్లెల్లో పార్కులు ఏర్పాటు చేయడంతోపాటు మండలానికి ఒక బృహత్ పల్లెప్రకృతి వనాన్ని మంజూరు చేసింది. ఇందులో భాగంగా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటైంది. ఇందులో నాటిన మొక్కల సంరక్షణ కోసం బిందెలతో నీళ్లు పోయడం సాధ్యం కాదని సర్పంచ్ ఆరెల్లి స్రవంతి అంజన్‌రావు భావించారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా పక్కనున్న ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ నీటిని మొక్కలకు అందిస్తున్నారు. పది ఎకరాల్లో ఆరు ఎకరాలు స్ప్రింక్లర్లు, రెండు ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేశారు. దీంతో మొక్కలకు నీరు సమృద్ధిగా అందుతూ ఏపుగా పెరుగుతున్నాయి.
పది ఎకరాలు.. 23వేల మొక్కలు
వనంలో 23వేల మొక్కలను నాటించారు. వాటిలో నీడను, పండ్లనిచ్చే మొక్కలతోపాటు భారీగా పెరిగే వేప, చింత, జిన్నె, మోదుగ, తదితర మొక్కలు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం రోజూ నాలుగు గంటల పాటు స్ప్రింక్లర్లతో వాన కురిపిస్తున్నారు. దీంతో మొక్కలకు సమృద్ధిగా నీరు అందుతోంది. మరో నాలుగేళ్లలో ఊరు సమీపంలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ పక్కన చిట్టడవి తయారవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది పక్షులు, జంతువులకు నిలయంగా మారనున్నది.
మొక్కలకు సేంద్రియ ఎరువు
బృహత్ పల్లెప్రకృతివనంలోని మొక్కల సంరక్షణ కోసం గ్రామ పంచాయతీ సిబ్బందితోపాటు మరో ముగ్గురు ప్రైవేట్ సిబ్బంది ఉన్నారు. వారు మొక్కలకు సేంద్రియ ఎరువును అందిస్తున్నారు. గ్రామానికి సంబంధించిన డంపింగ్‌యార్డులో తయారవుతున్న ఎరువుతోపాటు పశువుల పేడను కూడా వేస్తున్నారు. దీంతో మొక్కలు మూడు నెలల్లోనే ఏనుకొని పచ్చగా తయారయ్యాయి. పశువులు, జీవాలు వనంలోకి రాకుండా సిబ్బంది కాపలాగా ఉంటున్నారు. అలాగే మొక్కలకు నిత్యం నీటి సరఫరా చేయడంతోపాటు స్ప్రింక్లర్లు, డ్రిప్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నారు. రహదారి పక్కనున్నందున పశువులు వనంలోకి రాకుండా కంచె ఏర్పాటుకు సహకరించాలని కలెక్టర్‌ను ఇటీవల కోరడంతో రూ. లక్ష వరకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
జిమ్ ఏర్పాటుకు సన్నాహాలు
గ్రామానికి సమీపంలోనే ఉన్న బృహత్ పల్లెప్రకృతివనంలో యువకుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నం. యువకులు ఉదయం, సాయంత్రం వేళల్లో వనానికి వచ్చి వ్యాయామం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నం. దీనివల్ల యువకులు పోలీసు, ఇతర ఉద్యోగాలు సాధించడంతోపాటుగా ఆరోగ్యంగా ఉంటరు. అంతేకాక వనంలో అంతర్గత రోడ్లను కూడా వేయడం వల్ల వృద్ధులు వాకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే త్వరలోనే వనం ముఖద్వారం వద్ద గేటు, ఆర్చి ఏర్పాటు చేస్తం.