రాయపర్తి, నవంబర్ 12 : రాష్ట్రంలోని అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందు కోసమే ఎనిమిదేళ్లుగా కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, కోట శ్రీవత్సతో కలిసి మండల కేంద్రంలో పర్యటించారు. రాయపర్తిలోని మార్కెట్ సబ్ యార్డులో ఇందిరాక్రాంతి పథం-మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో, రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నేతృత్వంలో రైతు వేదిక భవనం సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రైతువేదిక భవనంలో దళితబంధు పథకంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుమారు ఆరు దశాబ్దాల పాటు సాగిన సీమాంధ్రుల పక్షపాత పాలనలో తెలంగాణ రైతులు ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ఈ ప్రాంతంలో పడావుపడ్డ ఎవుసాన్ని ప్రత్యేక రాష్ట్రంలో పట్టాలెక్కించి కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. రైతులు కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయాల కోసమే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాల ఉసురుపోసుకుంటున్నదని ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనలేమని చేతులెత్తేసిన బీజేపీకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కమలం నేతలకు చెంపపెట్టు అని అన్నారు.
సంక్షోభంలోనూ సంక్షేమానికే పెద్దపీట..
కరోనా విజృంభణ సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మండలంలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అలాగే పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను కేంద్ర ప్రభుత్వం అనుకరిస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, ఏపీడీ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి నరేష్కుమార్ నాయుడు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు బిల్ల రాధిక, అయిత రాంచందర్, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, డిప్యూటీ తహసీల్దార్ సూర్యనాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, స్వర్ణభారతి మండల సమాఖ్య అధ్యక్షురాలు అమరావతి, సీసీలు చీపురు దేవేంద్ర, చెవ్వ యాదగిరి, మండల నాయకులు పూస మధు, కుందూరు రాంచంద్రారెడ్డి, కోదాటి దయాకర్‌రావు, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, కందికట్ల స్వామి, చిన్నాల వనజ, గట్టు నర్సింహాచార్యులు, కుందూరు యాదగిరిరెడ్డి, వల్లపు వెంకటేశ్వర్లు, ఎండీ ఉస్మాన్, నయీం, రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.