ఖిలావరంగల్, నవంబర్ 10: తిరుమల కొండపై కూల్చిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహం, ఆంజనేయస్వామి విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించాలని అన్నమయ్య గృహ సాధన సమితి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి డిమాండ్ చేశారు. జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర గురువారం ఓరుగల్లు కోటలోని స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయానికి చేరింది. పది లక్షల సంతకాల సేకరణలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన శంభులింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. 2003లో కూల్చివేసిన అన్నమయ్య గృహంతోపాటు తొలగించిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని యథా స్థానంలోనే ప్రతిష్ఠించాలని టీటీడీ బోర్డును డిమాండ్ చేశారు. స్థానిక కళాకారుడు గడ్డం సుధాకర్, నాయకుడు గజ్జెల లింగమూర్తి విజయశంకర్స్వామిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గృహ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా శ్రీనునాయక్, ఉపాధ్యక్షుడు వీరన్న, జైభారత్ జాతీయ కార్యదర్శి సత్యనారాయణ, బీసీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంక న్న, ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శి ఇమ్మ య్య, రాఘవదాస్, సాంబశివరావు పాల్గొన్నారు.
ఆలయానికి చేరిన చైతన్యయాత్ర
వరంగల్ చౌరస్తా: తిరుమలలో కూల్చిన అన్నమయ్య ఇంటిని, మండపాలను యథావిధంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో చేపట్టిన అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర గిర్మాజీపేట గోవిందరాజులస్వామి ఆలయం వద్దకు చేరింది. ఆలయ అర్చకుడు వరయోగుల శ్రీనివాసస్వామి ఆధ్వర్యంలో చైతన్య యాత్ర నిర్వహిస్తున్న విజయశంకర స్వామికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ యాత్రలో రెండు రాష్ర్టాల్లోని ఆలయాల నుంచి పత్రాలు, హిందువుల నుంచి సంతకాలను సేకరిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని అభ్యర్థిస్తూ చైతన్య యాత్ర నిర్వహిస్తున్న విజయశంకరస్వామికి గోవిందరాజులస్వామి ఆలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి అభ్యర్థన పత్రాన్ని అందించినట్లు వారు అన్నారు.