గిర్మాజీపేట, నవంబర్ 7 : ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని గాయపరిచి నగదు, వస్తువులను అపహరించిన కేసులో నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. డీసీపీ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపేటకు చెందిన అందె చందర్ అక్టోబర్ 13న రాత్రి 11:30 గంటలకు ఇంటికి వెళ్లడానికి వరంగల్ బస్టాండ్ వద్ద ఆటోని ఆపాడు. అప్పటికే అందులో డ్రైవర్ సహా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు చందర్‌ను బెదిరించి ఆటోను నేరుగా గీసుగొండలో దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ముగ్గురు కలిసి అతడిని కొట్టి చేతులను కట్టేసి రూ. 1000 నగదు, స్మార్ట్‌ఫోన్, రోల్డ్‌గోల్డ్ చెయిన్, ఉంగరాన్ని అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా ఇంతెజార్గంజ్ సీఐ డీ మల్లేశ్ ఆధ్వర్యంలో ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు శివ, ఉపేందర్, రాజశేఖర్ దర్యాప్తు ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో మంచిర్యాల జిల్లా ముత్తారం మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన నిందితుడు అనుముల రాజును పట్టుకున్నారు. నిందితుడిని విచారించగా అతడి తమ్ముడు అనుముల శ్రీధర్, వెంగళ శ్యాం తనకు సహకరించారని అని చెప్పాడు. ముగ్గురు మద్యానికి బానిసై దొంగతనాలు, హత్య, దోపిడీలు చేశారని, ఇప్పటికే వీరిపై మంచిర్యాల, జగిత్యాల, బసంత్‌నగర్, కాల్వశ్రీరాంపూర్, జమ్మికుంట పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడు రాజును సోమవారం అరెస్టు చేశామని ఏ2, ఏ3 నిందితులు పరారీలో ఉన్నట్లు ఏసీపీ వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ కలకోట గిరికుమార్, సీఐ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు.