సుబేదారి, అక్టోబర్ 22 : ఇండ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను చంపుతామని బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడిని సీసీఎస్, లింగాలఘనపురం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.3.10 లక్షల విలువైన 60 బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి శనివారం వెల్లడించారు. ఏడుగురు సభ్యులు ఉన్న దోపిడీ దొంగల ముఠాలో సోనూసింగ్, బడేబాయి, తారిఫ్, నిస్సారుద్దీన్, రాహుల్‌తోపాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ముఠా సభ్యుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయున్ జిల్లాకు చెందిన ఫర్మాన్ఖాన్ (22)ను అరెస్ట్ చేశామని తెలిపారు. ముంబైలో పండ్ల వ్యాపారం చేసే ఫర్మాన్ఖాన్ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో స్థానికంగా ఉండే మరో నిందితుడితో కలిసి ట్రాక్టర్ బ్యాటరీలు దొంగతనాలు చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడు తారిఫ్ సూచన మేరకు వరంగల్‌లోని రెడ్డిపురంలో నివాసం ఉంటున్న మిగితా సభ్యులతో చేరాడు. సోనూసింగ్ గతంలో పత్తి మిల్లులో పనిచేయడంతో చుట్టు పక్కల జిల్లాలపై అవగాహన కలిగి ఉన్నాడని ఆయన తెలిపారు.
ఇంట్లో ఒంటరి మహిళల టార్గెట్‌గా వీరంతా ముందస్తు ప్రణాళికలో భాగంగా అంబాసిడర్ కారులో వరంగల్ జిల్లాతోపాటు చుట్టు పక్క జిల్లాల్లో రెక్కీ నిర్వహించారు. గతనెల 23న లింగాలఘనపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్లుట్ల గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి చంపుతామని బెదిరించి 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 70 వేల రూపాయల నగదు, ఏటీఎం కార్డులను చోరీ చేసి తిరిగి రెడ్డిపాలెం చేరుకున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ముఠాలో ప్రధాన నిందితుడు సోనూసింగ్ దోపిడీ చేసిన సొత్తులో కొంత బంగారం, నగదు అరెస్టయిన ఫర్మాన్ఖాన్కు ముట్టజెప్పాడు. దీంతో ముఠా సభ్యులు వారి స్వగ్రామాలకు వెళ్లారు. క్రైం అదనపు డీసీపీ పుష్ప ఆదేశాల మేరకు సీసీఎస్, లింగాలఘణపురం పోలీసులు నెల్లుట్ల దోపిడీ కేసుపై ప్రత్యేక దృష్టిసారించారు. పక్కా సమాచారంతో శనివారం వరంగల్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి నిందితుడు ఫర్మాన్ఖాన్ పారిపోయే ప్రయత్నం చేశాడు. నిందితుడిని పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు లభించాయని పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి వెల్లడించారు. నిందితుడిని విచారించగా ముఠాతో దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించాడని తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన క్రైం ఏసీసీ డేవిడ్ రాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్, శ్రీనివాసరావు, లింగాలఘనపురం ఇన్స్పెక్టర్ సంతోష్, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, ఏఏవోలు సల్మాన్‌పాషా, ప్రశాంత్, సీసీఎస్ ఎస్సైలు రాజేందర్, యాదగిరి, లింగాలఘనపురం ఎస్సై రఘుపతి, ఏఎస్సై వీరస్వామి, తిరుపతి, హెడ్‌కానిస్టేబుళ్లు రవికుమార్, సదయ్య, మహ్మద్ అలీ, జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, భాస్కర్‌ను పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి అభినందించారు. సమావేశంలో అదనపు డీసీపీ వైభవ్‌గైక్వాడ్ పాల్గొన్నారు.