నర్సింహులపేట, నవంబర్ 28 : టమాట ధర అమాంతం పెరుగడం.. రైతన్నకు అధిక లాభాలు తీసుకొస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైన బొజ్జన్నపేట గ్రామ శివారు బీమ్లాతండాలో రైతులు ఎక్కువ మంది కూరగాయలు సాగుచేస్తున్నారు. ముఖ్యంగా బీర, కాకర అధికంగా పండిస్తున్నారు. డీఈడీ చేసిన అనిత వ్యవసాయంపై మక్కువతో భర్త భద్రుతో కలిసి వివిధ పంటలు సాగు చేసింది. అయితే అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. అయినా కూడా కుంగిపోకుండా ఎకరంలో వరి, ఎకరం బీర, మరో ఎకరంలో కాకర సాగు మొదలుపెట్టారు. ఉద్యానశాఖ అధికారి సూర్యనారాయణ, రాకేశ్ ప్రోత్సాహంతో తోడవడంతో నాలుగేళ్ల నుంచి రైతు దంపతులు అనిత-భద్రు వెనక్కి తిరిగి చూడలేదు. అంతేగాక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది కూరగాయల సాగుపై అన్ని ఖర్చులు పోను రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నామని సంతోషంగా చెబుతున్నారు. అధికారులు ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందంటున్నారు.
అర ఎకరంలో ఆరు నెలలకు సుమారు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ధర సుమారు రూ.20 నుంచి 25వరకు అమ్ముతారు. ప్రస్తుతం ధర ఎక్కువగా ఉండడంతో మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. అర ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రూ.20 ధర చొప్పున రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఖర్చులు రూ.45900 పోను రూ.1,54,100 వరకు మిగులుతుంది. ఏడాదిలో రెండు పంటలకు రూ.3 లక్షల వరకు ఆదాయం అర ఎకరానికే వస్తుంది.
నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా..
నాలుగేళ్లుగా అర ఎకరంలో టమాట సాగు చేస్తున్నా. రెండెకరాల్లో బీర, కాకర వేసిన. ఏడాదిలో రెండు పంటలు వేస్తున్నా. అన్ని ఖర్చులు పోను ఏడాదికి రూ.5 లక్షల వరకు మిగులుతున్నాయ్. వాతావరణం అనుకూలించకపోతే లాభం తక్కువగా వచ్చినా.. నష్టం మాత్రం రాదు.