నెక్కొండ, జూన్ 16: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు పొందాలని ఎంఈవో రత్నమాల సూచించారు. ఎమ్మార్పీ భవన్లో గురువారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల హాజరు, రికార్డుల నిర్వహణ, మన ఊరు-మన బడి కార్యక్రమాల పురోగతి, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలపై హెచ్ఎంలతో చర్చించి పలు సూచనలు చేశారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ జబాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. అంకితభావంతో బోధన చేయడం ద్వారా విద్యార్థుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలుస్తారని వివరించారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. బడిబాట, మనఊరు-మనబడి కార్యక్రమాల అమల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, జ్యోతిలక్ష్మి, రంగారావు, హైస్కూల్ హెచ్ఎంలు శ్రవణ్‌కుమార్, విజయభాస్కర్‌రెడ్డి, దేవేందర్‌రావు, ఎంఐఎస్ కో ఆర్డినేటర కార్తీక్, సీఆర్పీలు సుమలత, దేవేందర్, లావణ్య, శ్రీనివాస్, పీఎస్, యూపీఎస్ హెచ్ఎంలు పాల్గొన్నారు.
టీచర్లు సమయపాలన పాటించాలి
ఉపాధ్యాయులు సమయపాలన పాటించి పిల్లలకు నాణ్యమైన బోధన అందించాలని సంగెం ఎంపీపీ కందకట్ల కళావతి అన్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంఈవో ఎన్ విజయ్‌కుమార్ అధ్యక్షతన పీఎస్, యూపీఎస్, హెచ్ఎస్, కేజీబీవీ, టీఎస్ ఎంఎస్ హెచ్ఎంల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనఊరు-మనబడి మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల హెచ్ఎంలు, ప్రజాప్రతినిధులతో ఈ నెల 20న సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలను తెలియజేస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎంఈవోగా అవార్డు అందుకున్న విజయ్‌కుమార్‌ను సన్మానించారు. సమావేశంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో ఎన్ మల్లేశం, ఎంపీవో కొమురయ్య పాల్గొన్నారు. రాయపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యా శాఖ మండల నోడల్ ఆఫీసర్, డీసీఈబీ కార్యదర్శి గారె కృష్ణమూర్తి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎంఈవో నోముల రంగయ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల పీఎస్, ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ల బలోపేతానికి హెచ్ఎంలు అహర్నిశలు కృషి చేయాలని కోరారు. అనంతరం మన ఊరు-మన బడి కార్యక్రమాల నిర్వహణ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీ, బ్రిడ్జి కోర్సుల నిర్వాహణ, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే పద్ధతులపై అవగాహన కల్పించారు. సమావేశంలో హెచ్ఎంలు లక్ష్మీనారాయణ, రావుల భాస్కర్‌రావు పాల్గొన్నారు.