కరీమాబాద్, జూన్ 16: జిల్లాలో పట్టణ, పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. 14వ రోజు గురువారం జిల్లావ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని వరంగల్ నగరంలో గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు, గ్రామాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులను ఆదేశించారు. ఇందులో భాగంగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య 32వ డివిజన్లో నర్సరీ ఏర్పాటుతోపాటు బస్తీ దవాఖాన స్థలాన్ని కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి పరిశీలించారు. అనంతరం పలు కాలనీల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. మురుగు, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీలు, మోరీలను శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లం రవి పాల్గొన్నారు. అలాగే, 32, 39, 40, 41, 42వ డివిజన్లో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన పర్యటించి స్థానికుల ద్వారా సమస్యలు గుర్తించారు. సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని కోరారు.
36వ డివిజన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతాం
వరంగల్‌చౌరస్తా/గిర్మాజీపేట/పోచమ్మమైదాన్/కాశీబుగ్గ: 36వ డివిజన్‌ను గ్రేటర్ వరంగల్‌లోనే మోడల్‌గా తీర్చిదిద్దుతానని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ అన్నారు. డివిజన్ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఆమె పాల్గొని స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారి రాజునాయక్, డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య, జిల్లా నాయకులు సయ్యద్ మసూద్, గడల రమేశ్ పాల్గొన్నారు. 25వ డివిజన్లోని వేణురావుకాలనీలో టీఆర్ఎస్ నాయకుడు బస్వరాజ్ శ్రీమాన్ పర్యటించారు. వేణురావుకాలనీలో నివాస స్థలాలపై భారీగా ఆక్రమించిన చెట్ల కొమ్మలను జీడబ్ల్యూఎంసీ డీఆర్ఎఫ్ టీం సహాయంతో తొలగించి, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు.
నిజాంపుర హనుమాన్ ఆలయం వద్ద డ్రైనేజీ వ్యవస్థ క్రమబద్ధీకరణ ఏర్పాట్లను డీఈ రవికిరణ్‌తో కలిసి పర్యవేక్షించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో వైశ్యుల శ్మశానవాటిక ఎదుట రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్ఐ సమస్యలను నమోదు చేసుకున్నారు. పెరుకవాడలో ఉన్న ప్రధాన సమస్యలు, అత్యవసర రోడ్డు నిర్మాణ పనులు, రైల్వేలైన్ పక్కనున్న నాలాలో పూడిక తీయించాలని కార్పొరేటర్ అరుణాసుధాకర్ గ్రేటర్ అధికారులకు సూచించారు. 13వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను కార్పొరేటర్ సురేశ్ జోషి పరిశీలించారు. డ్రైనేజీల్లోని చెత్తాచెదారం, సిల్ట్‌ను తీయించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను మట్టితో పూడ్చివేయించారు. జేసీబీతో ప్రభుత్వ స్థలంలో పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ధరంసింగ్, జవాన్లు, సాంబరాజు, రాజు, వినయ్ పాల్గొన్నారు.
12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ 22వ బ్లాక్‌లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల పారిశుధ్య సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రతిభ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సోలా రాజు, బీ కొమురయ్య, అనిల్‌యాదవ్, సీవో మాధవి, వర్క్ఇన్స్పెక్టర్ సుమంత్ పాల్గొన్నారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్, 22వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. 3వ డివిజన్ పైడిపల్లిలో కార్పొరేటర్ జన్ను షీబారాణి-అనిల్ పారిశుధ్య పనులు నిర్వహించారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చివేసి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని జేసీబీతో తొలగించారు. స్థానికంగా సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ సిబ్బంది ఎల్లస్వామి, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు ఈట్యాల పెద్ద సతీశ్ పాల్గొన్నారు.