జఫర్‌గఢ్, జూన్ 10 : పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని, ఇందుకనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని తమ్మడపల్లి(ఐ), జఫర్‌గఢ్, ఓబులాపూర్, తీగారంలో శుక్రవారం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మడపల్లి(ఐ)లో రూ. 4 లక్షల వ్యయంతో నిర్మించే అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. జఫర్‌గఢ్, తీగారంలో క్రీడా ప్రాంగణాలను ఆయన ప్రారంభించారు. ఓబులాపూర్‌లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్ల్లో రాజయ్య మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలని రాజయ్య కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గాదెపాక అనిత, బల్లెపు వెంకట నర్సింగరావు, నీరజారెడ్డి, జయపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జయపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు ఇల్లందుల స్రవంతి, రాజేశ్, నాయకులు ఇల్లందుల శ్రీనివాస్, స్వామి, ధనుంజయ్, సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో..
స్టేషన్ ఘన్పూర్ : పల్లెల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టిన ‘పల్లెప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇప్పగూడెంలో ఉప సర్పంచ్ పోకల లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన పల్లెప్రగతి గ్రామసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఉద్యమ నేత సీఎం కావడంతో గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. చిన్న గ్రామ పంచాయతీల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని, ఇందుకు నిదర్శనంగానే తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్, ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీవో సుధీర్, విద్యుత్ శాఖ ఏడీ పాపిరెడ్డి, ఏఈ ప్రవీణ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రజిత, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ శాఖ అధ్యక్షుడు జూలుకుంట్ల రాజశేఖర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల యాకయ్య, టీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎన్నకూస రాంనర్సయ్య, జూనియర్ లైన్మెన్ వెంకటేశ్ పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉదయం నుంచి సా యంత్రం వరకు గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. శిథిలమైన ఇళ్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్ల వద్ద విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం మండల ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్, ఎంపీడీవో రఘురామకృష్ణ పలు గ్రామాల్లో పర్యటించి పనులు పర్యవేక్షించారు. మన ఊరు – మనబడిలో ఎంపికైన పాఠశాలల్లో పనులను వేగవంతం చేయాలని వారు సూచించారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాల నుంచి లూస్లైన్లు సరి చేస్తున్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలు ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని ఆదేశాలు ఇస్తున్నారు. మహిళా సంఘాలు, సీసీలు తడిపొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు.
లింగాలఘనపురంలో..
లింగాలఘనపురం : మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగింది.సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పారిశుధ్య సిబ్బందితో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. స్మశాన వాటికల్లో నీరు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసరు లత, తహసీల్దార్ అంజయ్య, ఎంపీడీవో సీతారాంనాయక్, ఎంపీవో మల్లికార్జున్, ఈసీ వెంకటేశ్వర్లు, ఏఈలు మధు, బాలకృష్ణ, డ్టాకర్లు అనిత, కరుణాకర్‌రాజు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా గ్రామాల్లో పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. వీధుల్లో పరిశుభ్రతకుతోడు డ్రైనేజీల నుంచి చెత్తాచెదారం తొలగిస్తున్నారు. గ్రామాల్లో క్రీడామైదానాల ఏర్పాటులో అధికారులు నిమగ్నయారు. శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్‌యార్డ్‌లను వినియోగంలోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం దేవరుప్పులలో సర్పంచ్ ఈదునూరి రమాదేవి పారిశుధ్య కార్మికులతో పాటు మురుగు కాల్వల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించారు. ధరావత్ తండా సెగ్రిగేషన్ షెడ్డులోని గదుల్లో నిల్వ చేసిన ఇనుప సామాను, కాగితపు అట్టలు, సీసాలు, ప్లాస్టిక్ సామాన్లను విక్రయించారు. దీంతో వచ్చిన డబ్బును గ్రామపంచాయతీలో జమచేశారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు వెంకన్న, సంధ్యారాణి, ప్రత్యేకాధికారులు సాగర్, సత్యనారాయణ పాల్గొన్నారు.