తొర్రూరు/పర్వతగిరి, జూన్ 10 : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో మన పల్లెలు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామాలుగా గుర్తింపు పొందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం తొర్రూరు మండలం గుర్తూరు, పర్వతగిరిలో పర్యటించారు. జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ కె.శశాంకతో కలిసి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసి, మహిళా సంఘాలకు రూ.8.47 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులు అందజేశారు. రూ.50లక్షలతో చెక్‌డ్యాం, రూ.కోటి తో గుర్తూరు-సాదునాయక్ తండా వరకు బీటీ రోడ్డు, రూ.12.40కోట్లతో కంఠాయపాలెం, మడిపల్లి, ఫత్తేపురం, సాదునాయక్ తండా, దుబ్బతండా వరకు రోడ్డు వెడల్పు, మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. రూ.4.64కోట్లతో చెక్‌డ్యాం, రూ.కోటీ 20లక్షలతో సీసీ రోడ్లు, కాల్వలు, రూ.12లక్షలతో గ్రామ పంచాయతీలో నిర్మించిన అదనపు గదులు, రూ.12లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
మన ఊరు-మన బడిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో రూ.30లక్షలతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పర్వతగిరి మండలకేంద్రంలో రూ.10కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, రైతు వేదిక, అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించి, పర్వతగిరి మహిళా సంఘాల సభ్యులకు రూ.12కోట్ల రుణాల చెక్కులు అందించారు. పర్వతగిరి సెంటర్లో సుమారు రూ.60 లక్షలతో రూర్బన్ పథకం ద్వారా షాపింగ్ కాంప్లె క్స్, లైబ్రరీ కోసం శంకుస్థాపన చేశారు. పాఠశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేసిన ముఖ్యమంతుల్రు ఇద్దరేనని.. వారిలో ఒకరు ఎన్టీఆర్ అయితే, మరొకరి కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాల దృష్టిని ఆకర్షించిందన్నారు.
వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అందజేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. దేశంలో మన రాష్ర్టాన్ని, మన గ్రామాలను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీలన్నీ పల్లె ప్రగతికి ముందు, తర్వాత అనేలా తయారయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములను చేస్తామని తెలిపారు. నాలుగో విడత పల్లె ప్రగతిలో ఇప్పటి వరకు నాటిన మొక్కలు బతికేలా, వైకుంఠధామాలను వినియోగించుకునేలా చూడాలని, పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో పది శాతం గ్రీనరీ నిధులతో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని, అవన్నీ ఎండలకు ఎండిపోకుండా నీళ్లు పోసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.285 కోట్లు వెచ్చిస్తున్నదని తెలిపారు. పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.8,963 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.2,748 కోట్లు కలిపి మొత్తం రూ.11,711కోట్లు ఖర్చు చేసిందన్నారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠాధామాలు కొన్ని వినియోగంలోకి రాలేదని, వాటికి కరెంటు, నీటి వసతి అందించేలా చూసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. దేశంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో 20 ఉత్తమ గ్రామాలను కేంద్రం ఎంపిక చేయగా వాటిలో 19 తెలంగాణవేనని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దిన వారికి అవార్డులు ఇస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోత్కూరి రవీంద్రాచారి, ఎంపీటీసీ మేరుగు మాధవి రమేశ్, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషన్ డైరెక్టర్ లింగాల వేంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, డీపీవో సాయిబాబా, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవో రమేశ్, ఎంపీడీవో కుమార్, తహసీల్దార్ రాఘవరెడ్డి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.సోమేశ్వర్రావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, నాయకులు మేరుగు ప్రకాశ్, విస్పంపల్లి బాలకృష్ణ, ఈదురు వెంకన్న, దేవరకొండ శ్రీనివాస్, మల్లయ్య, సింగారపు కుమార్, బొర్ర శంకర్ పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై చౌకబారు విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. విద్య, వైద్యరంగాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని వివరించారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతూ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రూ.5.70 కోట్లతో పర్వతగిరి ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటుచేయడం బాగుందన్నారు. ఇప్పుడు ధనవంతుల బిడ్డలు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. పర్వతగిరి నుంచి ఏ వైపు వెళ్లినా డబుల్ లైన్ రోడ్డు ఉందని రాష్ట్రంలోనే బెస్ట్ మండలంగా పర్వతగిరి మండలానికి దీన్‌దయాల్ పురస్కారం లభించిందన్నారు. అనంతరం పర్వతగిరి మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి జగన్నాథరావు విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీపీఓ స్వరూప, డీఆర్డీఓ సంపత్‌రావు, జడ్పీ సీఈఓ రాజారావు, ఆర్డీఓ మహేందర్‌జీ, డీసీఓ సంజీవరెడ్డి, జడ్పీటీసీ సింగ్‌లాల్, ఎంపీపీ కమల పంతులు, సర్పంచ్ మాలతీరావు, ఎంపీటీసీ రాజు, మహేంద్ర, ఎంపీడీఓ చక్రాల సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
సైకిల్‌పై సవారి..
పల్లె ప్రగతి పనులను పరిశీలించేందుకు గుర్తూరుకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి.. గ్రామంలో సైకిల్‌పై వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు, మహిళలు బతుకమ్మ, బోనాలు, కోలాటాల నడుమ పూలు చల్లుతూ స్వాగతం పలికారు.