నమస్తే నెట్వర్క్:పల్లె, పట్టణ ప్రగతి పనులు ఎనిమిదో రోజు శుక్రవారం జోరుగా జరిగాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఫ్రైడే డ్రైడే సందర్భంగా నిల్వనీటిని తొలగించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వీధుల్లో పర్యటించి పరిశుభ్రత, తడిపొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిదని చెప్పారు. అలాగే పలుచోట్ల కొత్త విద్యుత్ పోల్స్ వేయగా, మరికొన్ని ప్రాంతాల్లో మరమ్మతు ముమ్మరంగా చేశారు. గ్రేటర్ వరంగల్‌లోని 4వ వార్డులో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రగతి పనులను పరిశీలించడంతో పాటు స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భూపాలపల్లిలోని 15, 16, 17వ వార్డుల్లో కలెక్టర్ భవేశ్‌మిశ్రా పర్యటించి పట్టణంలో పరిశుభ్రతా పనులు ఉదయం నుంచే మొదలుపెట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించి సూచనలు చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక, జోగంపల్లి గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. వాడవాడనా తిరుగుతూ మురికికాల్వలు, రోడ్లను పరిశీలించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. –