నమస్తే నెట్వర్క్: పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి పనులు ఊరూరా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు, ప్రజాప్ర తినిధులు ఆయా కాలనీల్లో, గ్రామాల్లో రోడ్లపై ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తీసి వేయించారు. మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. క్రీడాప్రాంగణాలు, మన ఊరు-మన బడి పనులను పరిశీలించా రు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
పల్లె ప్రగతి ఐదో విడుత, పట్టణ ప్రగతి నాలుగో విడుత కార్యక్రమాలు ఆదివారం ముమ్మరంగా సాగాయి. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా పట్టణాలు, గ్రామాల్లో పర్యటించారు. పారిశుధ్య పనులు చేయించారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు. కొన్నింటిని అక్కడే మంజూరు చేయించారు. మరికొన్నింటిపై హామీలిచ్చారు. భూపాలపల్లి పట్టణంలోని మూడో వార్డులో జరిగిన పట్టణ ప్రగతి, కొత్తూరు(ఎస్ఎం), చిట్యాల మండలంలోని దూత్‌పల్లి, ఒడితల, గోపాలపూర్ గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండాల్లో జీపీ బిల్డింగ్లు మంజూ రు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తపల్లి గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.64 లక్షలతో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం, పెద్దపెండ్యాల గ్రామా ల్లో పారిశుధ్య పనులు, క్రీడా మైదానాలను అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి పరిశీలించారు. జనగామ జిల్లా పాలకుర్తి దళిత, బీసీ కాలనీల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు పారిశుధ్య పనులను చేపట్టారు. తానే స్వయంగా డ్రైనేజీల్లో చెత్తను తొలగించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార చేత పట్టి చెత్తను తొలగించారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా తొర్రూరు మండలం హరిపిరాలలో పల్లె ప్రగతి అమలు తీరును తనిఖీ చేశారు. జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి, ఉప్పుగల్లు గ్రామాలను జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి సందర్శించి పల్లె ప్రగతి పనులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సభల్లో పాలొని మాట్లాడారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పల్లె ప్రగతి అమలు తీరును పర్యవేక్షించారు. అదేవిధంగా కొడకండ్ల మండలం చెరువుముందు తండా, రామేశ్వరం, రామవరం, జీబీ తండాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేశారు.
మహబూబాబాద్ మండల పరిధిలోని గోపాలపురంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న మిషన్ భగీరథ పంప్‌హౌస్‌ను కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, కమిషనర్ ప్రసన్నారాణితో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఎన్సీసీని ఆదేశించారు. 19వ వార్డులో చైర్మన్, కమిషనర్ పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. బయ్యారం మండలం కొత్తపేటలో పారిశుధ్యాన్ని జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు పరిశీలించారు. డోర్నకల్‌లోని 15వ వార్డు శాంతి నగర్, తొర్రూరులోని 14వ వార్డులో ఆయా మున్సిపల్ చైర్మన్లు వాంకుడోత్ వెంకన్న, రామచంద్రయ్య పాల్గొని పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట, బోరునర్సాపురం, రాజుపేట, అకినేపల్లిమల్లారం గ్రామాల్లో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ డీపీవో వెంకయ్య, ప్రత్యేకాధికారులతో కలిసి పర్యటించారు. పల్లె ప్రగతి పనులను తనిఖీ చేశారు.
వరంగల్ 20వ డివిజన్లోని పద్మనగర్, శాంతినగర్, కాశీబుగ్గలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రం స్వీకరించి వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను అదేశించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 45, 46, 64 డివిజన్లలో కార్పొరేటర్లతో కలిసి మేయర్ గుండు సుధారాణి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. మడికొండలో హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పాల్గొని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. గీసుగొండ మండలం కోనాయిమాకుల, మరియపురం, నర్సంపేట మండలంలోని లక్నెపల్లి, మహేశ్వరం గ్రామాల్లోని పల్లె ప్రగతి పనులను పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు పరిశీలించారు.