పరకాల, నవంబర్ 19: సీఎం కేసీఆర్ చేసిన ధర్నాతోనే నల్ల చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని ప్రకటించడం రైతుల విజయమని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించే కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మూడేళ్ల రికార్డు కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగు నీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. సాగు నీరు, రైతు బంధుతో రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్నారని, దీంతో రాష్ట్ర వ్యాస్తంగా సాగు రెట్టింపు అయ్యిందన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతూ రైతుల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే బీజేపీ నాయకులు వరిని పండించాలంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే విధంగా ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడంతో కేంద్రం దిగి వచ్చి రైతు చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రధాని పేర్కొన్నారని, రానున్న రోజుల్లో ధాన్యంపై కూడా పోరాటం చేస్తామని అన్నారు.
పోరాట ఫలితమే నల్లచట్టాల రద్దు
ధర్మసాగర్ : రైతుల సుదీర్ఘ పోరాట ఫలితమే నల్లాచట్టాల రద్దు అని, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ధర్నాచౌక్‌లో చేపట్టిన మహాధర్నాకు కేంద్ర ప్రభుత్వం తలవంచిందని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు.దేశంలో రైతులు సాధించిన విజయమని, ప్రతిఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నారాయణగిరి గ్రామంలో సర్పంచ్ కర్ర సోమిరెడ్డి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు దేశానికి వెన్నెముక అని చెప్పే ఈ దేశంలో రైతు వ్యతిరేక విధానాలకు కేంద్రం పాల్పడుతున్నదని విమర్శించారు. బీజేపీకి హఠావో దేశ్‌కి బచావో అనే రోజులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో హద్దు మీరి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు నోళ్లు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
ప్రభుత్వ విధానాలు తెలియకుండా, చట్టాలపై అవగాహన లేకుండా ప్రజాస్వామ్య విలువలు లేకుండా బీజేపీ నాయకులు ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడేలా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు వీర్రవీగుతూ రైతుల కల్లాల వద్దకు వెళ్లి అల్లర్లు సృష్టించారని, రైతులపై దాడులు చేశారని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విధంగా 48 గంటల్లో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకపోవడానికి, రైతుల సంక్షేమం కోసం రైతుల పక్షాన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం తరపున ముందుంటామని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మునిగేల రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాలేరు కరంచంద్, జనగామ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, జిల్లా మత్స్య సహకార సొసైటీ డైరెక్టర్ పిట్టల శ్రీలత, నియోజకవర్గ ఉద్యమకారుల కన్వీనర్ మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ మండల ప్రధాన కార్యదర్శి కందుల గట్టయ్య, కోఆప్షన్ సభ్యులు ఎండీ షుకుర్, జానీ, గ్రామశాఖ అధ్యక్షుడు కొలను మధుకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్, నాయకులు సాయిమల్లు, బేరే మధుకర్ పాల్గొన్నారు.