వరంగల్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు జో రుగా సాగాయి. హనుమకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్‌లపై నల్లజెండాలతో భారీ ర్యాలీ తీశారు. ధాన్యం కొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామంటూ హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని తన ఇంటిపై నల్లజెండా ఎగరేసి నిరసన తెలియజేశారు. మహబూబాబాద్‌లో జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత క్యాంప్ ఆఫీస్‌తో పాటు కురవి మండలకేంద్రంలో ఓ రైతు ఇంటిపై నల్లజెండా ఎగరేయగా, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు 500 బైక్‌లపై ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరి జిల్లాకేంద్రంలోని ప్రతి వీధికి బైక్‌పై వెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. చిల్పూరు మండలం రాజవరంలో జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంకటాపూర్ మండలకేంద్రంలో ములుగు జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నల్లజెండాలతో ర్యాలీ తీశారు. యాసంగిలో పండించిన ప్రతి గింజనూ కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు దింపుడుకల్లం చేసి శాస్ర్తోక్తంగా దహన సంస్కారాలు చేశారు.