వర్ధన్నపేట, ఏప్రిల్ 8 : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు రాష్ట్రంలో పోరాటాన్ని ఆపేది లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పష్టం చేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ డివిజన్ కోనాపురం నుంచి ఫిరంగిగడ్డ వరకు రూ.30లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్ పాలకుర్తి సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..
మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త బొంతల కుమారస్వామి, డీసీతండాకు చెందిన భూక్యా శ్రీను ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందగా, వీరి కుటుంబాలకు పార్టీ బీమా కింద రూ.2లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అరూరి అందజేశారు. ఇల్లంద గ్రామానికి చెందిన ఆడెల్లి కేశవరెడ్డికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.60వేల విలువైన చెక్కును అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్ల జెండాతో నిరసన..
నయీంనగర్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ నల్ల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక..
పర్వతగిరి : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఏబీ తండాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జాటోత్ భద్రూనాయక్, రమేశ్, శంకర్, వీరన్న, మోహన్, కిషన్, రాజేందర్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, రైతు బంధ సమితి మండల కన్వీనర్ చిన్నపాక శ్రీనివాస్, ఎంపీటీసీ మాడ్గుల రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే, కల్లెడ గ్రామానికి చెందిన దుగ్యాల వసంతరావు భార్య కళావతి మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని అరూరి పరామర్శించారు.