వర్ధన్నపేట, ఏప్రిల్ 3: కేంద్రం దిగొచ్చి యాసంగిలో రైతులు పండించే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే వరకూ టీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఆగదని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. సోమవారం వర్ధన్నపేటలోని జాతీయ రహదారిలో ఉన్న అంబేద్కర్ సెంటర్లో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టనున్న స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తుండడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. కేంద్రం మొండి వైఖరి విడనాడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, పూజారి రఘు, మైనార్టీ నాయకుడు ఎండీ రహీమొద్దిన్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నేడు మండలానికి ఎర్రబెల్లి రాక
రాయపర్తి: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం మండలకేంద్రంలో టీఆర్ఎస్ మండల కమిటీ నేతృత్వంలో నిర్వహించనున్న రైతు దీక్షకు హాజరు కానున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ తెలిపారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతులు యాసంగిలో పండిస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ నేతృత్వంలో పోరాటాలను ఉధృతం చేస్తున్నట్లు చెప్పారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మంకుపట్టు వీడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నర్సింహానాయక్ తెలిపారు. ఆందోళనలో భాగంగా వంటావార్పు ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అనుబంధ నేతలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, పూస మధు, గారె నర్సయ్య, అయిత రాంచందర్, ఎండీ నయీం, గబ్బెట బాబు, ఉండాడి సతీష్‌కుమార్, ముత్తడి సాగర్‌రెడ్డి, మహ్మద్ ఉస్మాన్, ఆశ్రఫ్ పాషా, మోహినొద్దీన్, బద్దం వేణుగోపాల్‌రెడ్డి, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, మచ్చ సత్యం, కొమ్ము రాజు, ఎల్లస్వామి పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఖానాపురం/గీసుగొండ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఖానాపురంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య పిలుపునిచ్చారు. కేంద్రం ధాన్యాన్ని కొనే వరకూ తెలంగాణ రైతులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గీసుగొండ మండలకేంద్రంలో సోమవారం దీక్ష చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.