దుగ్గొండి, మార్చి 31: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడులు, గురుకులాల్లో విద్యాబోధన అందిస్తున్నదని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల(ఎంజేపీటీ) వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గురుకులం ప్రతేకాధికారి కూరోజు దేవేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హరిసింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కళాప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో విద్యనభ్యసిస్తేనే అనుకున్నది సాధిస్తారని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయని సూచించారు. కార్యక్రమంలో శాయంపేట బీసీ గురుకులం ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రాజ్‌కుమార్, ఏటీపీ సుకుమార్, వార్డెన్ సోమరాణి, ఉపాధ్యాయులు రాజు, ప్రభాకర్, కోటి, సురేశ్, బషీర్, కిరణ్, రమేశ్, సతీశ్, ప్రేమలత, రోజా, రాజు, బోధనేతర సిబ్బంది ఉస్మాన్, శేఖర్, నరేశ్, బుచ్చయ్య, అరుణ, రాధిక, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.