వైరస్ సోకిన గర్భిణులకు భరోసా
ఆపత్కాలంలో కొండంత అండగా హన్మకొండ ప్రసూతి వైద్యశాల
ఇప్పటివరకు 200మందికి పైగా పాజిటివ్ గర్భిణులకు డెలివరీలు
బాలింతలకూ మెరుగైన సేవలు
దవాఖానాలో ప్రత్యేక వార్డు
హాస్పిటల్కు, ఇంటికి తీసుకెళ్లేందుకు మూడు ‘102’ వాహనాలు
హన్మకొండ చౌరస్తా, మే 26 : కరోనా సోకిన గర్భిణులను కంటికిరెప్పలా కాపాడుకుంటూ హన్మకొండ ప్రసూతి వైద్యశాల భరోసా కల్పిస్తున్నది. బాలింతలకు సైతం మెరుగైన సేవలు అందిస్తూ ఆపత్కాలంలో కొండంత అండగా నిలుస్తున్నది. కొవిడ్ పాజిటివ్ వచ్చినవారికి వైద్యులు అండగా నిలుస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డెలివరీలు చేస్తున్నారు. ఇక్కడికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచి గర్భిణులు వస్తుండగా లాక్డౌన్లోనూ వారికి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నారు.
దవాఖానలో ప్రత్యేక వార్డు
హన్మకొండ ప్రసూతి వైద్యశాలలో కొవిడ్ పాజిటివ్ గర్భిణులకు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. రోజూ వార్డులను శుభ్రంగా ఉంచడంతో పాటు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఇక్కడి వైద్యులు పాజిటివ్ ఉన్నవారికి ప్రత్యక్ష దేవుళ్లుగా మారారు. వైరస్ సోకిన వారిలో మనోధైర్యాన్ని నింపుతూ సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. ఏడాది నుంచి చూస్తే 200మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణులకు డెలివరీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తల్లికి వైరస్ ఉన్నా, పిల్లలకు మాత్రం సోకడం లేదు.
మెరుగైన సేవలందిస్తున్నాం..
కొవిడ్-19 సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దవాఖానలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. కొవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని వార్డులను రోజూ శుభ్రం చేయిస్తున్నాం. లాక్డౌన్లో ఇబ్బందులు కలుగకుండా గర్భిణులకు, బాలింతలకు వైద్యసేవలందిస్తున్నాం.
సరళాదేవి, సూపరింటెండెంట్, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలఅందుబాటులో మూడు 102 వాహనాలులాక్డౌన్ సమయంలో 102 వాహనాలు గర్భిణులకు, బాలింతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పరీక్షలు, ప్రసవం కోసం ఈ వాహనాల్లోనే తీసుకొస్తున్నారు. ప్రసూతి వైద్యశాలలో మూడు 102 వాహనాలు, ఒక 108 అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయి. లాక్డౌన్తో రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 102 వాహనాల ద్వారా నేరుగా ఇంటి నుంచి దవాఖానకు, తిరిగి ఇంటికి చేర్చేలా చూస్తున్నారు. ప్రతి ట్రిప్పునకు వాహనాన్ని శానిటైజ్ చేస్తూ సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.