హనుమకొండ చౌరస్తా, మార్చి 29 : అధికారుల పట్టింపులేనితనం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంతో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణ పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో రూ. 28 కోట్లతో చేపట్టిన నూతన భవన నిర్మాణాలు, పునరుద్దరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు.
నిబంధనల ప్రకా రం వాడాల్సిన ఇసుక, ఇటుక, సిమెంటు, రాడ్లు, మొరానికి బదులు నాసిరకం మెటీరియల్ వాడుతుండగా, పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై, నాణ్యతను తుంగలో తొక్కి బిల్లులు మంజూరు చేయించుకోవడమే లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి చెక్కుచెదరకుండా ఉండాల్సిన భవనాల పనులను నాణ్యతాలోపంతో చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల పనులను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే నాణ్యతపై రాజీ పడొద్దని, దీర్ఘకాలం మన్నేలా పనులు జరగాలని ఆదేశించినప్పటికీ నాసిరకం ఇసుక, ఇటుక, రాళ్లతో కూడిన మొరం, తుప్పు పట్టిన రాడ్లు వాడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారు. దీనిపై ప్రజలు మండిపడుతుండగా ఇప్పుడు పాలిటెక్నిక్ నూతన భవనం నిర్మాణంలోనూ ఇలాగే జరుగుతున్నది. ఈ విషయమై ఎమ్మెల్యే-ప్రిన్సిపాల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఎవరికి వారు తామే తీసుకొచ్చినట్లు చెప్పుకుంటున్నారు. పాలిటెక్నిక్ కాలేజీ శిథిలావస్థకు చేరడంతో 2018 నుంచి మంత్రులు, విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరిగి నూతన భవనం మంజూరు చేయించానని ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే తానే తీసుకొచ్చినట్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ గొప్పులు చెప్పుకుంటున్నారని ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకొని హైదరాబాద్‌కు తిరిగానని, మంత్రులకు వినతిపత్రాలు అందజేసి నూతన భవనాన్ని తీసుకొస్తే ఇప్పుడు క్రెడిట్ అంతా ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
రూ.28 కోట్లతో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, హాస్టళ్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 1,800 మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతుండగా, మరిన్ని కొత్త కోర్సులు రానున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరుగనుంది. ఈ క్రమంలో మూడు ఫ్లోర్ల చొప్పున కళాశాల భవనంతో పాటు బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా నిర్మించేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నత్తనడకన కొనసాగుతున్న పనులు ఇంకా పిల్ల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి.