సుబేదారి/కరీమాబాద్, మే 20 : మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ జె.వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఓ భూ వివాదం కేసులో బాధితులను న్యాయం చేయకుండా వారిపైనే తప్పుడు కేసు పెట్టడంతో పాటు చనిపోయిన వ్యక్తి పేరు కూడా కేసులో నమోదు చేసి నిందితులకు సహకరించినట్లు సీపీ విచారణలో తేలడంతో అతడిపై వేటుపడింది. అలాగే ఇటీవల భట్టుపల్లి రోడ్డులో జరిగిన హత్య కేసు లో మహిళా నిందితురాలితో సదరు ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కూడా విచారణలో తేలింది.
ఇవేకాకుండా మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెంకటరత్నం వివాదాస్పద పోలీసు అధికారిగా పేరొందారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓ మాజీ రౌడీషీటర్‌తో అంటకాగి భూ వివాదాల్లో తలదూర్చి బాధితులను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు వెంకటరత్నం సస్పెండ్ కావడంతో బాధితులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మాజీ రౌడీషీటర్ అండతో తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడని.. పాపం పండిందంటూ మిల్స్‌కాలనీ స్టేషన్ పరిధిలో పలువురు బాధితులు చర్చించుకోవడం గమనార్హం.
ఎమిమిది నెలల్లో ఇద్దరిపై వేటు
పలువురు ఇన్స్పెక్టర్ల తీరుతో శాఖాపరమైన చర్యలకు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ కేంద్ర బిందువుగా మారింది. విధి నిర్వహణలో అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం, నిందితులకు సహకరిస్తూ బాధితులను బెదిరిస్తూ పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా వ్యహరించారనే ఆరోపణలతో ఎనిమిది నెలల కాలంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వేటు పడింది. తాజాగా సస్పెండ్ అయిన వెంకటరత్నం కంటే ఎనిమిది నెలల క్రితం ఇన్స్పెక్టర్గా ఉన్న మల్లయ్య కూడా మాజీ రౌడీషీటర్ అండతో హద్దులు దాటి ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు.
అంతేగాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు, కేసుల విషయంలో సిబ్బందితో వెంకటరత్నం వ్యవహరించిన తీరుపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఫిర్యాదులను పరిష్కరించకుండా నెలల తరబడి తిప్పుకొంటున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇలా సీఐగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వెంకటరత్నం ఇదే తీరుగా వ్యవహరించడం.. ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలోనూ నిజమని తేలడం వేటుపడింది.