Warangal NIT | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 19 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో రెండవ రీసెర్చ్ స్కాలర్స్ కాన్ఫరెన్స్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ రెండు రోజుల కార్యక్రమం పిహెచ్డీ పరిశోధకుల మధ్య సహకారం, జ్ఞాన మార్పిడి, బహుశాఖల పరిశోధనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించబడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గతిశక్తి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ ధరి, వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుభుధి, అకాడెమిక్ డీన్ ప్రొఫెసర్ వెంకయ్య ధరి కలిసి ప్రారంభించారు.
ప్రొఫెసర్ వెంకయ్య ధరి మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ లో 125 మంది పిహెచ్డీ విద్యార్థులు పోస్టర్లు ప్రదర్శిస్తారని, వారిలో 45 మంది ఒరల్ ప్రెజెంటేషన్లకు ఎంపికయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఎన్ఐటీ వరంగల్ లో 1,400 మంది పిహెచ్డీ విద్యార్థులు ఉన్నారని, గతేడాది 150 మంది పిహెచ్డీ పట్టభద్రులు అయ్యారని పేర్కొన్నారు.
ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుభుధి మాట్లాడుతూ ఇనిస్టిట్యూట్‌లో పరిశోధన విస్తృతమవుతోందని, రూ.650 కోట్లతో రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు నిట్‌కు అధికారం కల్పించబడిందని తెలిపారు. పబ్లిష్ చేయడమే కాకుండా స్టార్టప్‌లు స్థాపించడం, పేటెంట్లు పొందడం, సమాజానికి మేలు చేసే సమస్యలను పరిష్కరించడంలో పరిశోధకులు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. పిహెచ్డీ పరిశోధకులు దేశాభివృద్ధికి వెన్నెముకగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ రవిశంకర్, అసోసియేట్ డీన్ (పిహెచ్ డీ) ఆయన బృందం సమన్వయం చేశారు.