వరంగల్, మార్చి 25 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే గ్రాంట్లపై ఆశతోనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూంసీ) బడ్జెట్‌ను రూపొందించింది. బుధవారం మేయర్ గుండు సుధారాణి అద్యక్షతన కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో రూ. 1,040.58 కోట్ల బడ్జెట్ అంచనాలను బల్దియా అకౌంట్స్ అధికారి శివలింగం వెల్లడించగా పాలకవర్గం ఆమోద ముద్రవేసింది. బల్దియా బడ్జెట్లో సుమారు 70 శాతం నిధులు గ్రాంట్ల రూపేణా వస్తాయని, సొంత ఆదాయం గతంకంటే రూ. 11 కోట్లు అధికంగా పెరుగుతుందని అంచనా వేశారు. గత ఏడాది కంటే ఈసారి రూ. 30.9 కోట్ల తక్కువ అంచనాతో బడ్జెట్ రూపొందించారు.
సొంత ఆదాయం రూ. 349.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 515.20 కోట్లు, కేంద్రం నుంచి రూ. 170 కోట్లు, మొత్తం రూ. 685.20 కోట్లు గ్రాంట్ల రూపేణా వస్తాయని అంచనా వేశారు. రూ. 6.20 కోట్ల డిపాజిట్లు, అడ్వాన్స్‌లు కలుపుకొని రూ.1,040.58 కోట్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సొంత ఆదాయంలో 10 శాతం (రూ. 34.91 కోట్లు) గ్రీన్ బడ్జెట్‌గా కేటాయించారు. దీంతోపాటు 42 విలీన గ్రామాలు, మురికివాడలు, వెనుకబడిన, మైనార్టీ ప్రాంతాల అభివృద్ధికి రూ. 25.43 కోట్లు కేటాయించారు.
కాగా, సొంత ఆదాయంలో పన్నుల రూపేణా రూ. 112.70 కోట్లు, స్టాంప్ డ్యూటీ ఫీజుల ద్వారా రూ. 40 కోట్లు, మున్సిపల్ ఆస్తుల కిరాయిల ద్వారా రూ. 10.10 కోట్లు, భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ. 126.50 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల ద్వారా రూ. 23.56 కోట్లు, నల్లా పన్నుల ద్వారా రూ. 36.27 కోట్లు వస్తాయని అంచ నా వేశారు. గ్రాంట్ల రూపంలో 15వ ఆర్థిక సంఘం నిధులు, యూడీఐఎఫ్ ద్వారా రూ. 127 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, మైనార్టీ సబ్‌ప్లాన్, స్వచ్ఛ భా రత్ మిషన్ పథకాల ద్వారా రూ. 43 కోట్లు, నియోజవర్గ అభివృద్ధి, స్పెషల్ డెవలప్మెంట్, ఎంపీ, ఎమ్మెల్యే లాడ్స్ తదితర నిధులు రూ. 515.20 కోట్లు (మొత్తం రూ. 685.20 కోట్లు) వస్తాయని అంచనా వేశారు.
బల్దియా సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన బడ్జెట్లో 1/3 శాతం విలీన గ్రామాల అభివృద్ధికి రూ.25.43 కోట్లు కేటాయించారు. రోడ్ల నిర్మాణాలకు రూ.12.43 కోట్లు , డ్రైనేజీ, కల్వర్టులకు రూ. 9.75 కోట్లు, తాగునీటి సరఫరాకు రూ. 1.50 కోట్లు, ఇతర మౌలిక వసతులకు రూ.1.75 కోట్లు కేటాయించారు. అలాగే ప్రజల కనీస అవసరాల కోసం రూ. 2.70 కోట్లు కేటాయించగా, అందులో వైకుంఠధామల అభివృద్ధికి రూ. 20 లక్షలు, పార్కులు, ఆట స్థలాలకు రూ. 15 లక్షలు, పబ్లిక్ టాయ్లెట్ల నిర్మాణానికి రూ. 20 లక్షలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు రూ. 10 లక్షలు, జంతు వధశాలల నిర్మాణానికి రూ. 40 లక్షలు, పారిశుధ్య నిర్వహణ,
డంపింగ్ యార్టుల కోసం రూ. 75 లక్షలు, స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కోసం రూ. 30 లక్షలు, ఓపెన్ జిమ్స్ కోసం రూ. 60 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. కాగా, హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ హోదాలో బడ్జెట్ సమావేశానికి హాజరైన చాహత్ బాజ్‌పాయ్‌ను మేయర్‌తో పాటు కార్పొరేటర్లు సత్కరించారు.
గత ఏడాది బడ్జెట్ కంటే ఈసారి అంచనాలు తగ్గాయి. 2025-26 బడ్జెట్‌ను రూ.1,071.48 కోట్లతో ప్రవేశ పెట్టగా, ప్రస్తుతం రూ. 30.90 కోట్ల అంచనాలు తగ్గించి రూ.1,040.58 కోట్లతో రూపొందించారు. రోజురోజుకు విస్తరిస్తున్న నగరంలో పెరుగుతున్న కొత్త నిర్మాణాలు, వాటి ద్వారా వచ్చే పన్నులు, ఫీజులతో సొంత ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే గతం కంటే కేవలం రూ.11 కోట్లు మాత్రమే సొంత ఆదాయం పెరుగుతుందని బడ్జెట్లో అంచనాలు వేయడం విస్మయాన్ని కలిగిస్తున్నది.