వరంగల్ : చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వరంగల్ కలెక్టర్ గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యలతో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని చెరువుల సుందరీకరణ, అభివృద్ధి, పరిరక్షణపై ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. చెరువులు అక్రమణలకు గురైతే వెంటనే టాస్క్‌ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకరావాలని ఆయన అన్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన జలవనరులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా టాస్క్‌ఫోర్స్ కమిటీ పని చేయాలని అన్నారు. చెరువులపై గ్రీన్ కవరేజ్‌ని పెంచాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, సిటీ ప్లానర్ వెంకన్న, కుడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, జిల్లా అగ్రిమాపక అధికారి భగవాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.