వరంగల్ చౌరస్తా, నవంబర్ 24: కాకతీయ మెడికల్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హిస్టారికల్ రన్ అండ్ రైడ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కేఎన్ఆర్ సైక్లింగ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఐఎంఏ వరంగల్ విభాగంతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, మనిషి ఆరోగ్యం కోసం చేయాల్సిన రెండు పనులను ఇందులో పోటీలుగా నిర్వహించడం ఆనందంగా, ఆసక్తిగా ఉందని అన్నారు. శారీరక శ్రమ తగ్గిపోయి యాంత్రిక జీవనానికి అలవాటు పడుతున్న ఈ రోజుల్లో పరుగు, సైక్లింగ్‌పై అవగాహన, ఆసక్తిని పెంచడం కోసం కేఎన్ఆర్ సైక్లింగ్ ఈవెంట్స్ సంస్థ ఐఎంఏ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో మూడు, ఐదు, పది కిలోమీటర్ల పరుగు పందెంతో పాటుగా 10 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీ నిర్వహించారు. కేఎంసీ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన పందెం ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ వరకు సాగింది. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఐఎంఏ వరంగల్ విభాగం అధ్యక్షుడు అన్వర్‌మియా, పలువురు ప్రముఖ వైద్యులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. సుమారు 600 మంది మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.