ప్రభుత్వ స్కూళ్లు హైటెక్ హంగులతో మెరిసిపోనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చుతుండగా, సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు సహకారంతో స్టెమ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం జిల్లాలో 10 పాఠశాలలను ఎంపిక చేసి రూ. 7లక్షలతో స్మార్ట్ క్లాస్ రూమ్స్, లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం పెద్ద సైజ్ టీవీలు, సైన్స్ సంబంధిత పరికరాలు, ఆట వస్తువులు అందిస్తున్నారు. ప్రతి పాఠశాలకు ఇన్‌స్ట్రక్టర్‌తో పాటు పనుల పరిశీలనకు ప్రత్యేకంగా సూపర్వైజర్ను నియమించనున్నారు. ఇప్పటికే ఈ స్కూళ్లల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ అందించేందుకు పనులు జోరుగా సాగుతుండగా, కలెక్టర్ స్వయంగా స్మార్ట్ తరగతుల ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 3( నమస్తేతెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యను బలోపేతానికి చేసేందుకు కృషి చేస్తున్నది. దీంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకుల సహకారంతో సర్కారు స్కూళ్లకు హైటెక్ హంగులు సమకూరుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా 149 పాఠశాలలను ఆధునీకరిస్తున్నది. అలాగే, సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆర్థిక సహకారంతో జిల్లాలోని 10 పాఠశాలల్లో సుమారు రూ. 7లక్షలతో స్టెమ్ల్యాబ్లు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భూపాలపల్లి, జంగేడు, గొల్లబుద్దారం, గణపురం మండలంలోని చెల్పూరు, రేగొండ మండలంలోని మడతపల్లి, చిట్యాల మండలంలోని నైన్పాక, టేకుమట్ల, మొగుళ్లపల్లి, మహదేవపూర్ మండలంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, కాళేశ్వరం జడ్పీఎస్ పాఠశాలను ఎంపిక చేశారు. వీటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ ల్యాబ్‌ల(స్టెమ్)ను ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం పెద్ద టీవీలతో పాటు సైన్స్ సంబంధిత పరికరాలు, ఆట వస్తువులను పాఠశాలలకు అందిస్తున్నారు. ప్రతి పాఠశాలకు ఇన్‌స్ట్రక్టర్‌తో పాటు పనుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను నియమించనున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలో డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పనులను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.