విస్తారంగా వర్షాలు కురవడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా వానకాలం పంటల సాగుకు నడుం కట్టారు. సుదీర్ఘకాలం తర్వాత జూలైలోనే నీటి వనరులు నిండిపోవడంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయశాఖ అంచనాలకు మించి పత్తి సాగు చేశారు. ఈసారి 1,13,532 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 1,17,699 ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. వరి నాట్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం చివరి దశకు చేరగా, మొత్తం 1,03,493 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. మిరప సాగు చేసేందుకూ రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, వరి, మిరపతో పాటు సోయాబీన్, మక్కజొన్న, జొన్న, దయించ, పెసర, వేరుశనగ సాగవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
వరంగల్, ఆగస్టు 22(నమస్తేతెలంగాణ) : ప్రస్తుత వానకాలం రైతులు జిల్లాలో 3,08,473 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. ఈ మేరకు వానకాలం ప్రారంభం కావడానికి ముందు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది. పంటల వారీగా పత్తి 1,13,532, వరి 1,31,817, మక్కజొన్న 21,932, వేరుశనగ 5,027, మిరప 16,373, పసుపు 5,672, కంది 2,000, ఇతర పంటలు 12,120 ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని అంచనా వేసి నివేదికలో తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు విత్తనాలు, ఎరువుల కేటాయించింది. ఊహించినట్లుగానే రైతులు జిల్లాలో ఈసారి అంచనాకు మించి పత్తి సాగు చేశారు. పంటల సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే రైతులు జిల్లాలో 1,17,699 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు గుర్తించారు. సాగు విస్తీర్ణంలో 16,014 ఎకరాలతో సంగెం మండలం జిల్లాలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నది. ఆ తర్వాత 13,441 ఎకరాలతో గీసుగొండ రెండో స్థానంలో, 12,795 ఎకరాలతో రాయపర్తి మండలం మూడో స్థానంలో నిలిచింది. 12,441 ఎకరాలతో నెక్కొండ నాలుగో స్థానంలో, 1,498 ఎకరాలతో వరంగల్ మండలం చివరి స్థానంలో ఉన్నది. వరప్రదాయిని పాకాల సరస్సు నీటితో ఎక్కువగా వరి పంట సాగు జరిగే ఖానాపురం మండలంలో రైతులు 2,485 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
తుది దశకు నాట్లు..
జిల్లాలో ఇప్పటివరకు 2,44,258 ఎకరాల్లో రైతు లు వివిధ పంటలు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. పత్తి పంట 1,17,699 ఎకరాలు ఉండగా, వరి 1,03,493 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. పంటల వారీగా కంది 281, సోయాబీన్ 63, మక్కజొన్న 9,554, జొన్న 11, దయించ 10,984, పెసర 343, వేరుశనగ 1,735, ఇతర పంటలు 131 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొద్దిరోజుల నుంచి వానలు ఆగిపోవడంతో రైతులు వివిధ పంటలు సాగు చేసే పనుల్లో తలమునకలయ్యారు. ఎడతెరిపిలేని వర్షాలతో పంట ల్లో నీరు నిలువడంతో కొంత ఆందోళన చెందినా ఎరువులు, మందుల వినియోగంతో నష్టాల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం మిరప, పసుపు తదితర పంటలను సాగు చేసేందుకు దుక్కులు సిద్ధం చేస్తున్నారు.
వరి నాట్లు చివరి దశకు వచ్చాయి. పాకాల సరస్సుతో పాటు మరికొన్ని చెరువుల కింద ఇంకా కొన్ని ఎకరాల్లో నాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నా రు. జూలైలోనే వర్షాలు సమృద్ధిగా పడినా కూలీల కొర త వల్ల వరి నాట్లు వేసే పనులు ఇప్పుడిప్పుడే తుది దశ కు చేరినట్లు రైతులు చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహం, మార్కెట్లో మంచి ధర పలుకుతుండటం వల్ల ఈ ఏడాది రైతులు పత్తి పంట సాగుకు మొగ్గు చూపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ తెలిపారు. రైతులు ఇంకా వరి నాట్లు వేస్తున్నారని, దీంతో సాగు విస్తీర్ణం పెరుగనుందని ఆమె చెప్పారు.