భారత స్వతంత్ర వజ్రోత్సవాలు సోమవారం చివరి రోజూ ఉత్సాహంగా సాగాయి. వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో భారీ జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ ఆకట్టుకుంది. హనుమకొండలో చిన్నారులు మహనీయుల వేషధారణలో అలరించారు. ములుగులో విద్యా శాఖ ఆధ్వర్యంలో గట్టమ్మ ఆలయం నుంచి వాజేడు వరకు బైక్ ర్యాలీ తీశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌లో జరిగిన వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు తరలివెళ్లారు.
నమస్తే నెట్వర్క్: భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పదిహేను రోజులపాటు పండుగ వాతావరణంలో జరిగాయి. చివరి రోజూ సంబురాలు అంబరాన్నంటాయి. పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడలు, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ములుగులో తిరంగా బైక్ ర్యాలీని డీసీఈబీ సెక్రటరీ విజయమ్మ జెండా ఊపి ప్రారం భించారు.
30 మంది ఉపాధ్యాయులతో గట్టమ్మ ఆలయం నుంచి వాజేడు వరకు ఈ ర్యాలీ సాగింది. హనుమకొండలో జిల్లా విద్యాశాఖ, వందేమాతరం ఫౌండేషన్ సౌజన్యం తో 1500 మంది బాలబాలికలు కిలోమీటర్ పొడవైన జాతీయ పతాకంతో ర్యాలీ తీశారు. ప్రభుత్వ బాలికల పాఠశాల లషర్ బజార్ నుంచి డీఈఓ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు మహనీయుల వేషధారణలో దేశభక్తి చాటారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో రెండు కిలోమీటర్ల త్రివర్ణపతాకంతో తీసిన ర్యాలీ స్వాతంత్య్ర నినాదాలతో మార్మోగింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలకు భారీగా తరలివెళ్లారు. ములుగు జడ్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ కృష్ణ ఆదిత్య, హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జనగామ కలెక్టరేట్లో జడ్పీ చైర్మన్ పాగాల సంప త్‌రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌తోపాటు ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు.