నల్లబెల్లి, ఆగస్టు 4: విధుల్లో అలసత్వం వహిస్తే వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్ హెచ్చరించారు. కరోనా టీకాలు తీసుకోకున్నా వేసుకున్నట్లు ప్రజలకు మెసేజ్లు వస్తుండడంపై ‘టీకా వేయకున్నా వేసినట్లుగా’.. శీర్షికతో గురువారం నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన డిప్యూటీ డీఎంహెచ్వో నల్లబెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. సిబ్బంది తొందరపాటుతో వివరాల నమోదులో తప్పులు దొర్లినట్లు గుర్తించారు.
మరోమారు ఇలాంటి పొరపాట్లు జరిగే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పీహెచ్సీలు, అన్ని సబ్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట వైద్యాధికారి శశికుమార్ ఉన్నారు.