ఖిలావరంగల్, ఆగస్టు 4: వరంగల్ జిల్లాలో 1.64 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా నెక్కొండ మండలంలో 12 సెంటీ మీటర్లు అత్యల్పంగా దుగ్గొండి మండలంలో 0.12 సెంటీమీటర్ల వర్షం పడింది. వరంగల్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వర్షపు నీరు నిలిచి ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ 37వ డివిజన్ తూర్పుకోటలోని శ్మశాన వాటికలో వర్షపు నీరు నిలిచి ఉంది. అంతిమ సంస్కారాలు, శ్రాద్ధ కర్మలు మోకాలు లోతు నీళ్లలోనే చేయాల్సి వచ్చింది.
ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు
అలాగే, రాతికోట ఉత్తర ద్వారం నుంచి పడమర ద్వారం వరకు వెళ్లే సీసీ రోడ్డుపై సుమారు 200 మీటర్ల మేర నాలుగున్నర అడుగుల ఎత్తులో వరద నీరు చేరింది. ఈ రోడ్డును మూసివేయడం లేదా ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో పర్యాటకులు తమ వాహనాలతో ముందుకు వెళ్తున్నారు. మధ్యలోకి వెళ్లిన తర్వాత వాహనాలు నిలిచి పోవడంతో స్థానికుల సాయంతో బయటకు వస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డును మూసి వేయాలని స్థానికులు కోరుతున్నారు. వర్షం తగ్గినా కూడా కోటలోని పంటలు, శివనగర్‌లోని పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ఉంది.