జనగామ చౌరస్తా, ఆగస్టు 1: ఏడాది వయసున్న కూతురిని ఓ తల్లి నీటి తొట్టిలో పడేసి కడతేర్చింది. నేరం తనపై పడకుండా ఉండేందుకు చైన్‌స్నాచర్ ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు, పోలీసులతో బుకాయించింది. చివరకు పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయి నేరం ఒప్పొకొని కటకటాలపాలైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలను వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాం సోమవారం సాయంత్రం 6గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
జనగామ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌నగర్ ఏరియా రైల్వేట్రాక్ పక్కన ఉంటున్న నడిగోటి భాస్కర్-ప్రసన్న దంపతులకు మూడున్నరేళ్ల కొడుకు నవనీత్, ఏడాది కూతురు తేజశ్రీ ఉన్నారు. పుట్టినప్పటి నుంచి పిల్లలిద్దర్నీ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. నవనీత్ గుండెకు రంధ్రం పడినట్లు తెలియడంతో ఈ మధ్యే రూ.8.50 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించారు. తేజశ్రీ మూగతో పాటు కాళ్లు చేతులు కదపపోవడం, భవిష్యత్తులోనూ పాప లేచి నడిచే అవకాశం లేదని వైద్యులు తెలుపడంతో ఆ దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. దీంతో పాటు బంధువులు, చుట్టుపక్కల వారు అనారోగ్య సమస్యలున్న పిల్లలతో ఎంతకాలం బతుకీడుస్తారు అని మాటిమాటికీ అంటుండడం ప్రసన్నను మానసికంగా మరింత కుంగదీసింది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం 11.30 గంటల సమంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ప్రసన్న తన కూతురిని నీటి తొట్టిలో పడేసింది. కాసేపటి తర్వాత తానే పాపను బయటకు తీసింది. పాపను తానే చంపినట్లు తెలిస్తే కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారు అసహ్యించుకుంటారని, కేసు అవుతుందని భయపడి హెల్మెట్ పెట్టుకొని, ముఖానికి మాస్క్ ధరించిన గుర్తు తెలియని ఓ చైన్ స్నాచర్ తన ఇంట్లోకి చొరబడి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు తెంపుతుండగా పెనుగులాట జరిగిందని, ఈ క్రమంలో చైన్ స్నాచర్ పుస్తెల తాడును అక్కడే వదిలేసి తన కూతురు తేజశ్రీని నీటి తొట్టిలో పడేసి పరారయ్యాడని కట్టుకథ అల్లింది.
‘క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్’లో చైన్ స్నాచింగ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించపోవడం, పోలీసు విచారణలో ప్రసన్న పలుమార్లు పొంతన లేని సమాధానాలు చెబుతుండడం, పోలీసులనే ఎదురు ప్రశ్నించడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరికి పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చి నేరం అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు ప్రసన్నపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన ఏసీపీ గజ్జి కృష్ణతో పాటు అర్బన్ సీఐ ఎలబోయిన శ్రీనివాస్, ఎస్సై ప్రవీణ్, సిబ్బందిని డీసీపీ సీతారాం ప్రత్యేకంగా అభినందించారు.