ఖిలావరంగల్, ఆగస్టు 1 : మద్యం మత్తులో బీజేపీ నాయకులు హల్చల్ చేశారు. నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన వాష్ రూమ్‌ను అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. భవన నిర్మాణానికి సంబంధించిన పరికరాలు, పనిముట్లను అపహరించారు. ప్రభుత్వ అ ధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడుతున్నామని చెప్పిన కాంట్రాక్టర్‌ను బూతులు తిడుతూ కొట్టడానికి వెళ్లారు.
బీజేపీ నాయకుల ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన సో మవారం గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్లోని గిరిప్రసాద్‌నగర్‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. దవాఖానలు అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్య సేవలు అందించాలని కృషి చే స్తోంది. ఇందులో భాగంగా స్లమ్ ఏరియాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తోంది. గిరిప్రపాద్నగర్కు బస్తీదవాఖాన మంజూరైంది. ఈ క్రమంలో కాలనీ వాసులు స మావేశమై కమ్యూనిటీ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌ను బస్తీ దవాఖానకు ఇచ్చారు. ప్రభు త్వం కూడా రూ.12లక్షలు కేటాయించింది. మెడికల్ ఆఫీర్కు ఒక గది, ల్యాబ్‌కు ఒక గది, స్టోర్ రూం, మందులు పంపిణీకి మరో గదిని సిద్ధం చేశారు.
దవాఖానకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో రోగుల కోసం వాష్ రూమ్‌ల నిర్మాణ పనులను మొదలు పెట్టారు. అయితే బీజేపీ నాయకులు ఈ వాష్ రూమ్‌లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా భవన నిర్మాణ పనిముట్లు, పరికరాలను ఎత్తుకెళ్లారు. అంద రూ చూస్తుండగానే మద్యం మత్తులో హంగామా చేశారు. కాంట్రాక్టర్‌తో దురుసుగా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా బీజేపీ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం కాంట్రాక్టర్ రవీందర్ మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవులపల్లి శ్రీనాథ్, పూర్ణ, సంపత్, నరేశ్, రాజుతో పాటు మరి కొంత మంది గడ్డపారలతో నిర్మాణంలో ఉన్న వాష్ రూమ్‌లను కూల్చి వేసి పనిముట్లు, పరికరాలను అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.