రాష్ట్రంలో పత్తి సాగు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో తెల్లబంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో జిల్లా రైతులు ఈసారి పత్తి సాగు వైపే మొగ్గుచూపారు. దీంతో అంచనాకు మించి ఈ దఫా పత్తి సాగవుతున్నది. జిల్లాలో ఈ సారి 1,09,601 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. కాగా, 1,15,507 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అంచనా కంటే సాగు విస్తీర్ణం 5,906 ఎకరాలు ఎక్కువ. పొలాలు, చెలుకల్లో భూసారం తగ్గిపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ సంపత్తి ఇస్తుందన్న గంపెడాశతో ముందుకు సాగుతున్నారు. కాగా, గత సంవత్సరం మిర్చి మిగిల్చిన నష్టాలూ పత్తి సాగు పెరిగేందుకు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆగస్టులో కూడా విత్తనాలు నాటే అవకాశమున్నందున సాగు విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
-నర్సంపేట రూరల్, ఆగస్టు 1
నర్సంపేట రూరల్, ఆగస్టు 1 : జిల్లా రైతాంగం పత్తి సాగుకే సై అంటున్నారు. ఏటేటా సంపత్తిని ఇస్తుండడంతో పత్తి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. ఈసారి జిల్లాలో 1,09,601 ఎకరాల్లో తెల్లబంగారం సాగవుతుందని వ్యవసాయ ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,15,507 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం 5,906 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. లాభాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా.. పత్తి సాగుపై మాత్రం రైతులు తగ్గడం లేదు. గత ఏడాది అకాల వర్షాలకు మిర్చి పంట ధ్వంసం కాగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సారి మిర్చి సాగు తగ్గించి పత్తి సాగు పెంచారు. పొలాలు, చెలుకల్లో భూసారం తగ్గిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏళ్లు పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో ఈ పంట సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
పెరిగిన విస్తీర్ణం..
జిల్లాలో పత్తి సాగు ఈ దఫా గణనీయంగా పెరిగింది. ఈ సారి పత్తి సాధారణ సాగు 1,09,601 ఎకరాలు కాగా ఇప్పటికే 1,15,507 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5,906 విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో గతంలో వేసిన పత్తి గింజలు మొలవకపోవడంతో మరలా పోగుంటలు పెట్టి సంరక్షించారు. అలాగే, పత్తిసాగు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయాధికారులు గ్రామగ్రామాన తిరుగుతూ రైతుల్లో చైతన్యం నింపి పత్తి సాగు ఎక్కువ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.
మా భూములు పత్తికి అనుకూలం..
– వేములపల్లి రాజు, రైతు, మాదన్నపేట
మాకున్న ఎకరం భూమి పత్తి పంటకు అనుకూలంగా ఉంటుంది. మిగతా పంటలు పండవన్న భయంతోనే ఈసారి కూడా పత్తి పంటే సాగు చేస్తున్నా. ఇతర పంటలు వేస్తే నష్టపోయే అవకాశముండటంతో, వ్యవసాయాధికారుల సలహాలు పాటించి పత్తి సాగు చేశాం.
అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్..
– కృష్ణకుమార్, మండల వ్యవసాయ అధికారి, నర్సంపేట
అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉంది. గత సంవత్సరం పత్తి క్వింటాల్ ధర రూ.10వేలకు పైగా పలికింది. నర్సంపేట మండలంలో గత సంవత్సరం రైతులు 6వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ సారి 8,100ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఒక్క ఈ మండలంలోనే 2,100 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది.