భారీగా కురుస్తున్న వర్షాలు.. విరివిగా కట్టిన చెక్‌డ్యాంలతో తొర్రూరు, పెద్దవంగర మండలాల పరిధిలోని ఆకేరు, పాలేరు వాగులు నిండా నీళ్లతో కళకళలాడుతున్నాయి. భారీ వర్షాలతో చెక్‌డ్యాంలు పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టులతో కిలోమీటర్ల మేర నీరు నిలిచి ఉండడంతో సాగు నీటికి ఢోకా లేదని ఈ ప్రాంత అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి రైతుల ఆకాంక్షను నెరవేర్చాలన్న సర్కారు సంకల్పానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి తోడై వాగులు జీవధారలుగా మారాయి. రెండు వాగులపై 14 చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.45.47కోట్లు విడుదల చేయగా కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. గత ఏప్రిల్ నుంచే ఈ వాగుల్లో జల ప్రవాహం కొనసాగుతుండడంతో చెక్‌డ్యాంల నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత వానలకు పాలేరు వాగుపై 20, ఆకేరు వాగుపై 15కిలోమీటర్ల మేర నీరు నిలిచి ఉండగా, మొత్తం నిర్మాణాలు పూర్తయితే ఈ రెండు మండలాలకే కాకుండా దంతాలపల్లి, నెల్లికుదురు మండలాల్లోని కొన్ని గ్రామాలకూ ప్రయోజనం కలుగనుంది.
– తొర్రూరు, జూలై 27
తొర్రూరు, పెద్దవంగర మండలాల పరిధిలోని ఆకేరు, పాలేరు వాగులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రెండు వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రభుత్వ సహకారం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో మంజూరు చేయించిన చెక్‌డ్యాంలు ఈ రెండు మండలాలతోపాటు నెల్లికుదురు, దంతాలపల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతులకు వరప్రదాయినిగా మారాయి. ఆకేరు, పాలేరుపై నూతనంగా 14చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.45.47కోట్ల నిధులను కేటాయించగా కొన్నిచోట్ల పనులు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. ఏప్రిల్ నుంచే ఈ వాగుల్లో జల ప్రవాహం కొనసాగుతుండడంతో చెక్‌డ్యాంలు నిర్మించడం కొంత ఇబ్బందిగా మారింది.
2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే ఈ చెక్‌డ్యాంలతో రెండు వాగుల్లో 70ఎంసీఎఫ్‌టీల మేర నీటి నిల్వ ఉండే అవకాశం ఉండగా, 303 ఎంసీఎఫ్‌టీల నీటిని వినియోగించుకుని 6వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.ప్రస్తుతం ఆకేరుపై సుమారు 15కిలోమీటర్లు, పాలేరుపై సుమారు 20కిలోమీటర్ల మేర జల సవ్వడి సంతరించుకుంది.
6వేల ఎకరాల ఆయకట్టుకు నీరు
ఆకేరు, పాలేరు వాగులపై నిర్మించే చెక్‌డ్యాంలతో సుమారు 70 మిలియన్ క్యూబిక్ ఫీట్ల(ఎంసీఎఫ్‌టీ) నీటి నిల్వ ఉండే అవకాశాలు ఉండగా 303 ఎంసీఎఫ్‌టీల నీటిని వినియోగించుకొని సుమారు 6వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిచవచ్చు. ఆకేరు వాగు పరిధిలో 2,525 ఎకరాల ఆయకట్టుకు, పాలేరు వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తయితే 3,550 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందనున్నది. ప్రస్తుతం ఆకేరు, పాలేరు వాగులపై ఉన్న ఉన్న చెక్‌డ్యాంలు మత్తళ్లు పోస్తున్నాయి.
పాలేరు వాగుపై వడ్డేకొత్తపల్లి ఆర్అండ్బీ రోడ్డు బ్రిడ్జి అనగా, కొరిపెల్లి శివారు నుంచి చీకటాయపాలెం వరకు నీరు నిల్వ ఉండడంతో దంతాలపల్లి మండలం పెద్దముప్పారం, ఆ ప్రాంత శివారు భూములకు ప్రయోజనం కలుగనుంది. ఆకేరు వాగులో సోమారం నుంచి మొదలుకుని మడిపల్లి శివారు సోమారపుకుంట తండా వరకు నీటి నిల్వల ఉండడంతో నెల్లికుదురు మండలం బ్రహ్మణకొత్తపల్లి, మేజరాజుపల్లితోపాటు శివారు ప్రాంతాల రైతులకు ఉపయోగం ఉంటుంది. పాలేరుపై 8 చెక్‌డ్యాంలతో 20 కిలోమీటర్ల మేర, ఆకేరుపై 6 చెక్‌డ్యాంలతో 15 కిలోమీటర్లకు పైగా నీటి నిల్వలు ఉండడం వల్ల 6వేల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతోంది. నిర్మాణాలన్నీ పూర్తయితే ఒక్కో చెక్‌డ్యాం పరిధిలో కిలోమీటర్ నుండి 3 కిలోమీటర్లకు పైబడి నీరు నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి.
వివిధ దశల్లో చెక్‌డ్యాంల నిర్మాణాలు
పాలేరు వాగుపై కర్కాల, బొమ్మకలు చెక్‌డ్యాంల నిర్మాణాలు 2018లోనే పూర్తి కాగా, వడ్డేకొత్తపల్లి వద్ద రెండు మీటర్ల ఎత్తుతో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.2.566కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నాయి. హరిపిరాల వద్ద రూ.3.5కోట్లతో చేపడుతున్న చెక్‌డ్యాం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వడ్డేకొత్తపల్లి బ్రిడ్జి వద్ద చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయినప్పటికీ కట్ట నిర్మాణం, రివిట్మెంట్ పనులు ప్రారంభం కాలేదు. పోచారం వద్ద రూ.4.102కోట్ల నిధులతో, కర్కాల వద్ద రూ.3.385కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ రెండుచోట్ల కట్ట నిర్మాణ పనులు 80శాతం పూర్తికాగా రివిట్మెంట్లు ప్రారంభం కాలేదు. చీకటాయపాలెం వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.3.966కోట్లు నిధులు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు.
ఇక ఆకేరు వాగుపై జమస్తాన్పూర్ వద్ద రెండు చోట్ల రూ.4.962, రూ.4.062కోట్లు నిధులతో చేపట్టిన రెండు చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తి కాగా ఒక చోట కట్ట నిర్మాణం పనులు 90శాతం, మరో చోట 60శాతం పూర్తయ్యాయి. రివిట్మెంట్ పనులు చివరి దశలో ఉన్నాయి. సోమారం వద్ద చెక్‌డ్యాంకు రూ.4.486కోట్లు నిధులు కేటాయించగా పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. గుర్తూరు వద్ద రూ.4.649కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులు పూర్తి కాగా కట్ట నిర్మాణం, రివిట్మెంట్ పనులు ప్రారంభం కాలేదు. కంఠాయపాలెం వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.5.910కోట్లు కేటాయించిన పనులు ప్రారంభం కాలేదు. సోమారపుకుంట తండా వద్ద రూ.7.380కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయినప్పటికీ కట్ట నిర్మాణం, రివిట్మెంట్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ రెండు వాగుల్లో ఉధృతంగా నీటి ప్రవాహం ఉండడంతో అసంపూర్తిగా పనులు ఉన్న చోట్ల నీటి ఉదృత్తికి చెక్‌డ్యాంల చుట్టూ కోతలు ఏర్పడే అవకాశం ఉందని ఇంజినీరింగ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.