ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లా అంతటా జూలైలోనే సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదుకావడంతో పంటల సాగు ఈ నెలలోనే అనూహ్యంగా మూడురెట్లు పెరిగింది. మొత్తం వానకాలం సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు 53.21శాతం సాగైంది. ఎక్కువ మంది రైతులు పత్తి వైపే మొగ్గు చూపగా వరి రెండో స్థానానికి పరిమితమైంది. పత్తి 1.55లక్షల ఎకరాలతో జనగామ, వరి 40వేల ఎకరాలతో మహబూబాబాద్ జిల్లాలు టాప్లో ఉన్నాయి. వరుస వానలతో వరినాట్లు ఊపందుకోగా సాగుపనుల్లో రైతాంగం హుషారుగా కనిపిస్తున్నది. ఈ సారి పప్పుదినుసుల సాగు కూడా ఆశాజనకంగా ఉన్నది.
వరంగల్, జూలై 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరుస వర్షాలతో ఈసారి వానకాలం సాగు జోరందుకున్నది. ఎప్పుడూలేనంతగా ఉమ్మడిజిల్లాఅంతటా జూలైలోనే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావడంతో పంటల సాగు విస్తీర్ణం ఒక నెల రోజుల్లోనే మూడు రెట్లు పెరిగింది. ఆరు జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 14.76లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 7.85లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. మొత్తం విస్తీర్ణంలో ఇప్పటిరకు 53.21శాతం సాగుకాగా.. ఎప్పటిలాగే ఈసారికూడా ఆరు జిల్లాల్లోనూ పత్తి ఎక్కువగా సాగైంది. ఆ తర్వాత వరి ఉన్నది.
మిగితా పంటలతో పోల్చితే మార్కెట్లో ధరలు ఆశావహంగా, స్థిరంగా ఉండడంతో ఎక్కువ మంది పత్తి వైపే మొగ్గుచూపుతున్నారు. జనగామ జిల్లాలో 1.55 లక్ష ఎకరాల్లో, వరంగల్ జిల్లాలో 1.14 లక్షల ఎకరాల్లో, మహబూబాబాద్ జిల్లాలో 87వేల ఎకరాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లక్ష ఎకరాల్లో, హనుమకొండ జిల్లాలో 70వేల ఎకరాల్లో, ములుగు జిల్లాలో 18వేల ఎకరాల్లో పత్తి సాగైంది. ఒకటిరెండు రోజులు పొడి వాతావారణం ఉన్నట్లు అనిపించినా రాత్రిపూట ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. ఇలా రెండు వారాలుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. పూర్తిగా తేమ వాతావరణం కావడంతో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి.
నీటి వసతి ఉండడంతో ఈసారి వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే నాట్లు సగం కంటే ఎక్కువ పూర్తయ్యాయి. మిగితా జిల్లాల్లోనూ కొనసాగుతున్నాయి. ప్రతిరోజు వానలతో వరికి తప్ప మిగితా పంటలకు ఒకింత ప్రతికూల వాతావరణం ఉంటున్నది. పప్పు ధాన్యాలు, ఇతర పంటలకు తేమ వాతావరణంతో సమస్యలు వస్తున్నాయి. ఆరు జిల్లాల్లోనూ పత్తి తర్వాత వరి సాగవుతున్నది
భూపాలపల్లిలో 129శాతం ఎక్కువ..
తెరిపి లేని వానలతో ఈసారి అత్యధిక వర్షపాతం నమోదవుతున్నది. ఈ సీజన్లో గోదావరి నదీ తీరం వెంట మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూలేని వానలు కురిశాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాధారణం కంటే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సాగునీటి ప్రాజెక్టులతో ఎండకాలంలోనూ నిండి ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాధారణం కంటే 129శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో ఇప్పటికే 451 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 1,031 మిల్లీమీటర్లు కురిసింది.
ములుగు జిల్లాలో సాధారణం కంటే 119శాతం ఎక్కువగా 1,120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం 360 మిల్లీమీటర్లు. 106 శాతం ఎక్కువగా 742 మిల్లీమీటర్లు పడింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 93 శాతం, హనుమకొండ జిల్లాలో 78శాతం ఎక్కువగా, వరంగల్ జిల్లాలో సాధారణం కంటే 70శాతం వర్షపాతం కురిసింది. జూలై నెలలో గతంతో ఎప్పుడూ లేని విధంగా అన్ని రోజుల్లోనూ ఆరు జిల్లాలో అధికంగా వానలు పడ్డాయి.