వర్ధన్నపేట, జూలై 27 : పేద దళిత కుటుంబాల ఆర్థిక ప్రగతి కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. దళితబంధు పథకంలో ఎంపికైన మండలంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఇద్దరు లబ్ధిదారులు వర్ధన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసుకున్న ఎరువులు, రంగుల దుకాణాలను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద దళిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఈ పథకంలో ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం అందించిన సహకారాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించకోకుండా లబ్ధిదారులు తప్పకుండా ఎంపిక చేసుకున్న పథకం ద్వారానే ఉపాధి పెంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం మొదటి దశలో కొంత మందికి మాత్రమే సహకారం అందించినప్పటికీ దశల వారీగా అర్హులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ప్రగతి సాధించాలని కోరారు.
ఈ పథకంపై కూడా విపక్ష పార్టీలు అర్థంలేని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విపక్ష పార్టీల నేతలకు కేవలం రాజకీయ లబ్ధి కావాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న విపక్ష పార్టీలకు ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అలాగే, ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే రమేశ్ కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, కౌన్సిలర్లు రవీందర్, రాజమణి, రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ సారంగపాణి పాల్గొన్నారు.
యాదవులకు అండగా ప్రభుత్వం
నయీంనగర్ : యాదవులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామంలో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని బుధవారం అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అంచూరి విజయ్‌కుమార్, ఎంపీటీసీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.