సుబేదారి, జూలై 27 : వరంగల్ నగరాన్ని ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్లపైనే అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రధాన రహదారుల వెంట ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. షాపింగ్‌మాల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి స్టాల్స్ పెట్టడం, షాషింగ్ కోసం వచ్చిన వారు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా వరంగల్ చౌరస్తా, స్టేషన్‌రోడ్డు, బస్టాండ్, పాతబీట్ బజార్, అండర్ రైల్వేగేట్, ఖమ్మం రోడ్డు, హంటర్‌రోడ్డు, పోచమ్మమైదాన్, ఎంజీఎం, ములుగురోడ్డు, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ బస్‌స్టేషన్ జంక్షన్, నయీంనగర్, నక్కలగుట్ట, అదాలత్ కాళోజీ జంక్షన్, సుబేదారి, కాజీపేట, కేయూసీ -పెద్దమ్మగడ్డ రోడ్డు, భీమారం, హసన్‌పర్తి వరకు ప్రధాన రహదారులకు ఇరువైపులా వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ ఉన్న ఏరియాల్లో అయితే ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేయడం అనేది సర్వసాధారణంగా మారింది.
ఫుట్‌పాత్‌ల ఆక్రమణ
వరంగల్ చౌరస్తా, ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్రోడ్డు, హనుమకొండ చౌరస్తా, విజయటాకీస్రోడ్డు, నక్కలగుట్ట ఏరియాలోని షాపింగ్ మాల్స్ నిర్వాహకులు ఫుట్‌పాత్‌లపై స్టాళ్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంతో రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న వరంగల్ నగరంలో రోజు రోజుకూ వాహనాల తాకిడి పెరిగిపోతోంది. నగరంలో మట్టెవాడ, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నల్స్ కేంద్రాల వద్ద డ్యూటీ, డ్రంక్అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు చేయడమే సరిపోతోంది. ఇక రోడ్లపైనే పార్కింగ్ చేసిన వాహనాల విషయంలో దృష్టిపెట్టడం లేదు. ఇక లా ఆర్డర్ పోలీస్ స్టేషన్ల అధికారులు మాత్రం తమకు ట్రాఫిక్ సమస్య సంబంధం లేదనే విధంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రోజూ స్టేషన్ ఫిర్యాదుల మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై వాహనాలు నిలుపకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.