టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. బర్త్‌డే కేక్ కట్ చేసి సంబురాలు చేసుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలు చేసి లక్షలాది మొక్కలు నాటి ప్రియతమ నేత రామన్నకు కానుకగా ఇచ్చారు. ‘గిఫ్ట్ ఎ స్మైల్’లో భాగంగా పేదలు, వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం అందించి మేమున్నాంటూ భరోసానిచ్చారు. అలాగే పలువురు టీఆర్ఎస్ నాయకులు అవయవ, నేత్రదానానికి అంగీకరిస్తూ పత్రాలు అందించారు. అనాథాశ్రమాల్లో చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్, బుక్స్, నిత్యావసర సరుకులు అందించారు.
– నమస్తే నెట్వర్క్
50లక్షల మొక్కలతో హరిత కానుక
మొక్క నాటి ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
చిల్పూరు, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం చిల్పూరు మండలం నష్కల్లోని జాతీయ రహదారికి ఇరువైపులా జనగామ వరకు 50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. మొక్కలు నాటి సంరక్షించాలని, మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో యువనేత, మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్, సర్పంచ్ కర్నెకంటి స్వప్న, వంగలపల్లి గ్రామ సర్పంచ్ ఆరూరి ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
లేజర్ లైట్స్‌తో బర్త్ డే విషెస్
ఖిలావరంగల్, జూలై 24 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు శనివారం అర్ధరాత్రి చారిత్రక ఓరుగల్లు కోటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే లేజర్ షో ఏర్పాటుచేసి ‘కేటీఆర్’ పేరు, చిత్రం వచ్చేలా రూపొందించి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. అనంతరం వేలకొద్ది లాంతర్ దీపాలను ఆకాశంలోకి వదిలారు. ఆ తర్వాత బర్త్‌డే కేక్ కట్ చేసి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
సుబేదారి, జూలై 24: తండ్రికి తగ్గ తనయుడు మంత్రి కేటీఆర్ అని, రాబోయే రోజుల్లో ఆయన దేశానికి నాయకత్వం వహించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కితాబిచ్చారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఆయన నివాసంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంద్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం కడియం మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని దేశ ప్రజలను ఆకర్షిస్తున్న గొప్ప నాయకుడని అన్నారు. సీఎం కేసీఆర్ తనయుడిగా తండ్రికి తగ్గ పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఐటీ మంత్రి గా రాష్ర్టానికి అత్యధిక సంఖ్యలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి హైదరాబాద్‌లో పరిశ్రమలు నెలకొల్పడానికి కృషి చేస్తున్నారని శ్రీహరి అభినందించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆయన సేవలు యువత, రాష్ట్ర ప్రజలు మరింత అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.