జయశంకర్ భూపాలపల్లి, జూలై 22(నమస్తేతెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో పంటలతోపాటు ఆస్తి నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా రూ.134.03 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో తాత్కాలిక మరమ్మతులకు రూ.15.60 కోట్లు, శాశ్వత పనులకు రూ. 118.42 కోట్ల నిధులు అవసరమని జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేసింది.ఈ మేరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి నివేదిక అందజేసింది.
దెబ్బతిన్న చెరువులు, కుంటలు
భారీ వర్షాలతో పలు చెరువులు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. మహదేవ్పూర్ డివిజన్-1లో మూడు, డివిజన్-2లో 22, భూపాలపల్లి డివిజన్లో నాలుగు చెరువులకు నష్టం వాటిల్లింది. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.1.14 కోట్లు, శాశ్వత పనులకు రూ.19.41 కోట్లు అవసరమని నివేదిక అందజేశారు. ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో రహదారులపై వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలికంగా రూ.1.39 కోట్లు, శాశ్వత మరమ్మతులకు13.40 కోట్లు అవసరమని నిర్ధారించారు. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రోడ్లు, కల్వర్టులు, లోలెవల్ వంతెనలకు రూ.12.19 కోట్ల నష్టం వాటిల్లింది. శాశ్వత మరమ్మతులకు రూ.58.70 కోట్లు అవసరమని గుర్తించారు. జాతీయ రహదారి-353 పరకాల నుంచి కాళేశ్వరం వరకు పెద్ద గుంతలు పడినట్లు నివేదికను రూపొందించారు.
మిషన్ భగీరథ గ్రిడ్..
మహాముత్తారం మండలంలోని అలుగువాగు వద్ద, మహదేవపూర్ మండలం పెద్దంపేట వాగు వద్ద మిషన్ భగీరథ పైపులు వరదలకు కొట్టుకుపోయి రూ. 27 లక్షల నష్టం వాటిల్లింది. శాశ్వత మరమ్మతులకు రూ.77 లక్షలు అవసరమని అంచనా వేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి మూడు సబ్ స్టేషన్లు, 218 స్తంభాలు, 289 డీటీఆర్స్ 5 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో తాత్కాలిక మరమ్మతులకు రూ. 46 లక్షలు, శాశ్వత పనులకు రూ. 33.7 కోట్లుగా అంచనా వేశారు.
నష్టం రూ. 21 కోట్లు
భారీ వర్షాలకు జిల్లాలో పత్తి పంట 13,043 హెక్టార్లు, వరి నారు 416 హెక్టార్లు, ఇతర పంటలు 353 హెక్టార్లలో దెబ్బతిన్నది. దీంతో సుమారు 21 కోట్ల నష్టం వాటిల్లింది. ఇసుక మేటలతో 294 హెక్టార్ల మేర పంట పొలాలు దెబ్బతిని రూ. 44.10 కోట్ల నష్టం జరిగింది.
పశు సంవర్ధక శాఖ..
వరదలతో 251 పశుసంపద మృత్యువాతపడింది. వీటిలో ఆవులు, గేదెలు 11, మేకలు, గొర్రెలు 240 ఉండగా, వీటి నష్టం అంచనా రూ. 10.50 లక్షలుందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కోసం రూ.10.50 లక్షలు అవసరమని కేంద్ర బృందానికి నివేదిక అందజేశారు.