హనుమకొండ, జూలై 22 : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అదేశించారు. ఈ మేరకు మంత్రి ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. వెంటనే జిల్లా అధికారులు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలన్నారు. ములుగు జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండాలన్నారు. ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్యను ఎర్రబెల్లి ఆదేశించారు. అలాగే గతేడాది వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా జాగ్రతలు చేపట్టాలని కోరారు. అధికారులు సమన్వయంతో కృషి చేసి చెరువులు, రోడ్లు తెగిపోకుండా చూడాలన్నారు. అలాగే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జనగామ జిల్లాలోని వాగులు, చెక్‌డ్యాములు, చెరువులు, కుంటలు మత్తడి పోసే అవకాశమున్నందున వాటి దగ్గరికి ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గంటగంటకు పాలకుర్తి నియోజకవర్గ పరిస్థితిని తెలుసుకుంటానని మంత్రి చెప్పారు.