ఖానాపురం, జూలై 20 : అశోక్‌నగర్ గిరిజన సైనిక పాఠశాల బాధ్యులపై గిరిజన సంక్షేమ పాఠశాలల రీజినల్ కో ఆర్డినేటర్ డీఎస్ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ‘నమస్తే’లో ‘సైనిక్‌స్కూల్ టిఫిన్‌లో పురుగులు, బ్లాక్ బోర్డుపై విద్యార్థుల ఫిర్యాదు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన వెంకన్న సైనిక్‌స్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. టిఫిన్‌లో పురుగులు వచ్చాయని, నీళ్ల చారు, ఉడికీ ఉడకని కూరలు పెడుతున్నారని, టాయిలెట్లు సక్రమంగా లేవని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం ఆర్సీవో కిచెన్షెడ్డును పరిశీలించారు. బియ్యం పురుగు పట్టి ఉండటాన్ని గమనించి అవసరం మేరకే కోటా తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు ప్రతిరోజు పండ్లు అందించాలన్నారు. పల్లి పట్టి, ఉప్మా రవ్వ పురుగు పట్టి ఉన్నాయని, వెంటనే వాటిని వాపస్ చేయాలన్నారు. కుళ్లిన కూరగాయలను సైతం వండుతున్నారని తన దృష్టికి వచ్చిందని, ఇకపై అలా జరగడానికి వీల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల డార్మెటరీలు, టాయిలెట్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సైనిక పాఠశాలలో మంగళవారం ఉదయం టిఫిన్‌లో పురుగులు వచ్చింది వాస్తవమేనన్నారు.
డైరెక్టర్ నిర్వహణ లోపంతోనే ఇలా జరిగిందన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. పాఠశాలలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు 2 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సైనిక్ స్కూల్లో ఉపాధ్యాయులు, సైనిక అధికారులకు మధ్య సమన్వయ లోపం ఉందన్నారు. డైరెక్టర్ పనితీరు, పాఠశాలలో జరుగుతున్న అవినీతిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. కాగా, అశోక్‌నగర్ సైనిక్స్కూల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ తదితరులు ఉన్నారు.