బయ్యారం, జూలై 19 : బయ్యారంలో నాణ్యమైన ఇనుప ఖనిజం.. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా నాన్చుతున్నది. ఉద్యోగాలొస్తాయని ఎదురు చూస్తున్న ఇక్కడి యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నది. ప్రతిసారీ కేంద్ర బడ్జెట్, పార్లమెంట్ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం నుంచి ప్రకటన చేస్తుందని, నిధులు కేటాయిస్తుందని ఎదురుచూడడం.. చివరికి ఎటూ తేల్చకపోవడంతో నిరాశ చెందడం ఇక్కడి ప్రజలకు పరిపాటి మారింది. ‘ఎన్నాళ్లీ అక్కసు.. ఎన్నాళ్లీ వివక్ష.. బయ్యారం ఉక్కుపరిశ్రమ స్థాపనకు ఇంకెన్నాళ్లు వేచిచూడాలి.. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నా పట్టింపులేదా.. ఇదేం ధోరణి’ అంటూ కేంద్రప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో మరోసారి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ఈ సారైనా కేంద్రం ప్రకటన చేస్తుందన్న ఆశతో ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఇనుప ఖనిజం విస్తారంగా ఉంది. 1,41,691 ఎకరాల్లో (5,690 హెక్టార్లు) విస్తరించి ఉండగా, అందులో మానుకోట జిల్లా బయ్యారం, గార్ల, గూడూరు మండలాల్లో 44వేల హెక్టార్లులో, కేవలం బయ్యారం మండలం ఇర్సులాపురం, రామచంద్రాపురం, మొట్లతిమ్మాపురం, చింతోనిగుంపు అటవీ ప్రాంతంలో 25,700 హెక్టార్లలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్లు గతంలో అనేక సర్వే సంస్థలు తేల్చాయి. అంటే 80శాతం ఇనుము బయ్యారం పరిసర ప్రాంతాల్లో ఉండడమే కాకుండా 60 నుంచి 70శాతం నాణ్యతను కలిగి ఉంది. దీంతో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలనే డిమాండ్ దశాబ్దకాలంగా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది.
రూ.30వేల కోట్లతో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలోని ఆర్టికల్ 13లో పేర్కొన్నది. అయినా, ఇప్పటి వరకు ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించడం లేదు. ఉక్కు పరిశ్రమ వస్తే కొలువులు వస్తాయని స్థానిక ప్రజల ఆశలను అడియాశలు చేస్తున్నది. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ సమయంలో, పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రకటన చేస్తారని, నిధులు కేటాయిస్తారని ఎదురుచూడడం.. చివరికి ఎటూ తేల్చకపోవడంతో నిరాశ చెందడం ఇక్కడి ప్రజల వంతుగా మారింది. అంతేకాకుండా ఇక్కడి ఇనుప ఖనిజంలో నాణ్యత లేదని, ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి బయ్యారం అనువైన ప్రాంతం కాదని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నది. సెయిల్, జీఎస్ఐ, సింగరేణి, ఎన్ఎండీసీ, వంటి సంస్థలు బయ్యారంలో సర్వే చేసి అన్ని అనుకూలతలు ఉన్నాయని నివేదిక ఇచ్చాయి.
ఉక్కు పరిశ్రమకు కావాల్సిన నీరు, విద్యుత్, డోలమైట్, బొగ్గు వంటి వనరులు బయ్యారం పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని తేల్చి చెప్పాయి. అంతేకాకుండా ఇక్కడ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తే నిరంతరాయంగా 30 సంవత్సరాలు నడిచే అవకాశముందని నిపుణులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఒకవేళ ఇక్కడి ఇనుప ఖనిజంలో నాణ్యత లేకపోతే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బైలడిల్లా నుంచి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక అక్కసును వెల్లగక్కుతున్నది.
బయ్యారం ఉక్కు కాపాడుకోవడం, పరిశ్రమ సాధనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుసంకల్పంతో పోరుబాట పట్టింది. నాటి సమైక్య పాలకులు రక్షణ స్టీల్స్ పేరుతో తెలంగాణలోని ఇనుప ఖనిజాన్ని దోచుకోవాలని చూడగా, ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ అనేక పోరాటాలు చేసి జీవోను రద్దు చేయించింది. అనంతరం విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు కోరారు.
అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల బయ్యారం వేదికగా ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేయగా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బయ్యారంలో పర్యటించిన సమయంలో స్టీల్‌ప్లాంట్‌పై స్పష్టమైన వైఖరి తెలుపాలని ఇక్కడి స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనలు తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని మళ్లీ జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా ఉక్కుపరిశ్రమపై స్పష్టమైన వైఖరి చెప్పాలని స్థానిక ప్రజలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.